
ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం కూలిపోయిన ఘటనలో సుమారు 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు టన్నెల్లో చిక్కుకుపోయిన వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
బాధితులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. సొరంగంలో నీటి సరఫరా కోసం వేసిన పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక అదే పైపు ద్వారా తాగునీరు, ఆహార పదార్థాలను కూడా సరఫరా చేస్తున్నట్లు సీనియర్ అధికారి ప్రశాంత్ కుమార్ వివరించారు.
బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్గావ్ వరకు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి టన్నెల్ ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వారికి బయటకు రావడానికి మార్గం మూసుకుపోయింది.
సమాచారం అందుకున్న కేంద్ర, రాష్ట్ర డిశాస్టర్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. కార్మికులను బయటకు క్షేమంగా తీసుకొచ్చేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తయేందుకు రెండు నుంచి మూడు రోజులు పట్టొచ్చని ఉత్తరకాశి ఎస్పీ అర్పన్ యదువంశి చెప్పారు.
టన్నెల్ ఆరంభం నుంచి 200 మీటర్ల దూరంలో కూలిపోయిందని తెలిపారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, వీలైన త్వరలో చిక్కుకుపోయినవారిని క్షేమంగా బయటకు తీసుకొస్తామని పేర్కొన్నారు.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ