అయోధ్యలో యుపి మంత్రివర్గం భేటీ

అయోధ్యలో యుపి మంత్రివర్గం భేటీ
ఉత్తరప్రదేశ్ చరిత్రలో రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర రాజధాని లక్నో వెలుపల  అయోధ్యలో మొదటిసారిగా జరిగింది. గురువారం సరయూ నది ఒడ్డున ఉన్న రామకథా మండపంలో జరిగిన సమావేశంలో నగర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అయోధ్య పరిశోధన సంస్థకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ అయోధ్య తీర్థ్ వికాస్ పరిషత్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
 
ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 14 ముఖ్యమైన ప్రతిపాదనలు తీసుకొచ్చామని, ఉత్తరప్రదేశ్‌లో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటు చేయాలనేది మొదటి ప్రతిపాదన అని, రాష్ట్ర స్థాయిలో ఈ అథారిటీని రూపొందించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి యోగి  ఆదిత్యనాథ్ సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు.
 
‘‘ఈరోజు ఉత్తరప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయం చేరింది. యూపీ ప్రభుత్వ కేబినెట్ మొత్తం అయోధ్య ధామానికి వచ్చింది. ఈరోజు యూపీ అభివృద్ధికి సంబంధించి ఓ ముఖ్యమైన సమావేశం జరిగింది. కేంద్ర, రాష్త్ర ప్రభుతాలకు  చెందిన 178 పథకాలు మనకు తెలుసు. అయోధ్యలో ఇప్పటికే రూ.30,500 కోట్లకు పైగా ప్రభుత్వ పనులు నడుస్తున్నాయి. కొరియా సహకారంతో అయోధ్యలో పార్కును కూడా అభివృద్ధి చేస్తున్నాము” అని చెప్పారు. 
 
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అయోధ్యలో రామాలయ సంబంధిత మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకారం, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ చరిత్రలో రాష్ట్ర రాజధాని వెలుపల క్యాబినెట్ సమావేశాలు నిర్వహించిన మొదటి ముఖ్యమంత్రి.
 
“ఇంతకుముందు 2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా క్యాబినెట్ సభ్యులు సంగంలో పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత, కాశీలో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, యోగి క్యాబినెట్ ఇప్పుడు శ్రీరాముని గౌరవనీయమైన జన్మస్థలం అయోధ్యలో సమావేశమయింది,” అని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది.
 
తన క్యాబినెట్ మంత్రులతో కలిసి అయోధ్యకు చేరుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమాన్ గర్హి, రామాలయంలో ప్రార్థనలు చేశారు. సమావేశానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ను మోహరించారు.  “అతిథుల సందర్శన కోసం మేము భద్రతా ఏర్పాట్లు చేసాము. దీపావళికి సిద్ధమవుతున్న ప్రజల రోజువారీ దినచర్యపై ప్రభావం చూపకుండా చూస్తాము. తగినంత పోలీసు బలగాలను మోహరించారు,” అని లక్నో జోన్ అదనపు డిజిపి పీయూష్ మోరిడా తెలిపారు.
 
అభివృద్ధి కార్యక్రమాలు, అయోధ్యలో జరగనున్న దీపోత్సవ వేడుకల సన్నాహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అయోధ్యలో జరుగుతున్న రామాలయ నిర్మాణ పనులను సమీక్షించారు.  రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ బాబ్రీ మసీదు- రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టు 2019లో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన నవంబర్ 9న రాష్త్ర మంత్రివర్గం అయోధ్యలో సమావేశం కావడం  ప్రాముఖ్యతను సంతరించుకుంది.