హ‌మాస్ వైమానిక ద‌ళ నేత హ‌తం

హ‌మాస్ వైమానిక ద‌ళ నేత హ‌తం
హ‌మాస్ ఉగ్ర‌వాద గ్రూపుకు చెందిన వైమానిక ద‌ళ నేత మురాద్ అబూ మురాద్ హ‌త‌మ‌య్యాడు. శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన వైమానిక దాడుల్లో మురాద్ చ‌నిపోయిన‌ట్లు ఇవాళ ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు పేర్కొన్నాయి.  అదే విధంగా, రాయిట‌ర్స్‌ వార్తా సంస్థ‌కు చెందిన జ‌ర్న‌లిస్టు మృతిచెందాడు.
 
వైమానిక కార్య‌కలాపాల‌ను సాగిస్తున్న హ‌మాస్ ప్ర‌ధాన కార్యాల‌యంపై ఇజ్రాయిల్ దాడి చేసింది.  ఆ దాడుల్లో మురాద్ హ‌త‌మైన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. గ‌త వారం నుంచి జ‌రుగుతున్న దాడుల్లో హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌కు మురాద్ దిశానిర్దేశం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 
 
హ్యాంగ్ గ్లైడ‌ర్ల ద్వారా హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఇజ్రాయిల్‌లో ప్రవేశించడానికి మురాద్ కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.  హ‌మాస్ క‌మాండో ద‌ళాల‌కు చెందిన డ‌జ‌న్ల సంఖ్య‌లోని కేంద్రాల‌పై దాడి చేసిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది. హ‌మాస్‌, ఇజ్రాయిల్ మ‌ధ్య దాడులు మొద‌లై నేటితో వారం ముగిసింది. ఇరు వైపుల భారీ ప్రాణ న‌ష్టం జ‌రిగింది. హ‌మాస్ దాడుల వ‌ల్ల ఇజ్రాయిల్‌లో 1300 మంది, ఇజ్రాయిల్ దాడుల్లో 1530 మంది హ‌మాస్ ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది.
 
కాగా, ద‌క్షిణ లెబ‌నాన్‌పై జ‌రిగిన దాడుల్లో ఆరుగురు జ‌ర్న‌లిస్టులు గాయ‌ప‌డ్డారు. ఇజ్రాయిల్ దిశ నుంచి వ‌చ్చిన మిస్సైల్ వ‌ల్ల వాళ్లు గాయ‌ప‌డ్డారు. అల్ జెజిరా, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్‌(ఏఎఫ్‌పీ)కు చెందిన జ‌ర్న‌లిస్టులు అల్మా అల్ సాహెబ్ ప్రాంతంలో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో మిస్సైల్ దాడి జ‌రిగింది. ఇజ్రాయిల్ బోర్డ‌ర్ వ‌ద్ద ఆ దేశ మిలిట‌రీతో పాటు లెబ‌నీస్ మిలిట‌రీ హిజ్‌బుల్లా కాల్పుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. జ‌ర్న‌లిస్టు మృతికి ఇజ్రాయిల్ కార‌ణ‌మ‌ని లెబ‌నాన్ ప్ర‌ధాని న‌జీబ్ మికాటి ఆరోపించారు.
యుద్ధంలో 1,500 మంది హమాస్‌ మిలిటెంట్లు సహా రెండు వైపులా మరణాల సంఖ్య 5 వేలకు పైగా చేరింది. గాజాలో 2,215 మంది పౌరులు మరణించగా, ఇజ్రాయెల్‌లో పలువురు జవాన్లు సహా 1,300 పౌరులు మృతిచెందారు.శత్రువులు మూల్యం చెల్లించుకోవడం ప్రారంభమైందని, తర్వాత ఏం జరుగుతుందో మాత్రం బయటకు చెప్పలేనని ఇజ్రాయెల్‌ ప్రధాని నేతన్యాహూ తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. హమాస్‌ నాశనమే తమ లక్ష్యమని మరోసారి పునరుద్ధాటించారు.