ఇజ్రాయిల్ లో ఉగ్రవాదుల దాడి పట్ల బిఆర్ఎస్ స్పందించదే!

ఇజ్రాయిల్ లో ఉగ్రవాదుల దాడి పట్ల బిఆర్ఎస్ స్పందించదే!
ఉగ్రవాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయిల్ దుర్ఘటన పట్ల  జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం దారుణం అంటూ బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి. మురళీధర్ రావు ధ్వజమెత్తారు. ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య వివాదం నేపథ్యంలో హమాస్ ముష్కరులు పాశవికంగా చేసిన దాడులు క్రూరమైనవని,  విపరీతమైన హింసాత్మకమైందని, మధ్యయుగాల్లో జరిగిన హింసను తలపించేలా ఉందని విమర్శించారు.


కేవలం మతం ఆధారంగా హింసను ప్రేరేపించిన దుర్ఘటనపై ప్రపంచంలోని మానవాళి దిగ్భ్రాంతి చెందిందని చెప్పారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ దృక్పథాన్ని స్పష్టం చేశారని చెప్పారు.  తెలంగాణ ఉగ్రవాద పీడిత ప్రాంతం అని, అనేక ఘర్షణలతో నష్టపోయిన ప్రాంతమని చెబుతూ ఈ ఉగ్రవాదంపై బిఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఖరి ఏమిటో తెలపాల్సిందే అని స్పష్టం చేశారు .
మౌనంగా ఉండటం ద్వారా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో తాము భాగస్వామ్యం కాదని చెప్పడమే బీఆర్ఎస్ ఉద్దేశంగా తెలుస్తోందని మురళీధరరావు విమర్శించారు. జాతీయ భద్రతకు ఏమైనా పర్లేదు.. పార్టీకి ప్రయోజనం చేకూరితే చాలు అని బిఆర్‌ఎస్ భావిస్తోందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలే బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ముఖ్యం అని మండిపడ్డారు. కాంగ్రెస్ హమాస్ దాడులను ఖండిస్తూనే, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని, హమాస్ ధోరణినే అవలంభిస్తోందని ధ్వజమెత్తారు.

ఉగ్రవాదులతో చేతులు కలిపిన చరిత్ర కాంగ్రెస్ ది అంటూ అనేకమార్లు రాజకీయ స్వలాభం కోసం, ఎన్నికల్లో గెలిచేందుకు ఉగ్రమూకలతో చేయి కలిపిందని బీజేపీ నేత ఆరోపించారు. ఉగ్రవాదంపై ఎంఐఎం- కాంగ్రెస్ ప్రకటన ఒకే విధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే, ప్రపంచంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తున్నదని తెలిపారు.

కాంగ్రెస్ తెలంగాణలో రాజకీయం చేస్తోంది అంటే కర్ణాటక రిజర్వాయర్ నుంచి డబ్బులు తెచ్చి తెలంగాణలో పంటకు ఖర్చు పెట్టినట్లుగా మారిందని మురళీధరరావు విమర్శించారు. ఇవ్వాళ కర్ణాటక లో దొరికిన డబ్బు తెలంగాణ ఎన్నికల కోసం ఉంచినదే అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక నుంచి డబ్బు విచ్చలవిడిగా వస్తోందని చెబుతూ ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి పెట్టాలని  ఆయన డిమాండ్ చేశారు.