నవంబర్ 23 వ తేదీన జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను రెండు రోజులు వాయిదా వేసి నవంబర్ 25 వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే మిగితా 4 రాష్ట్రాల్లో ముందుగా విడుదల చేసిన తేదీల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఈసీ స్పష్టం చేసింది.
నవంబర్ 23 వ తేదీన రాజస్థాన్‌లో ఒక్కరోజే 50 వేలకు పైగా వివాహాలు, ఇతర కార్యక్రమాలు ఉండటం వల్లే ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఫలితాలను మిగిలిన 4 రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3 వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిపింది.
తొలుత ఈసీ ప్రకటించిన నవంబర్ 23వ తేదీన కార్తీక శుద్ధ ఏకాదశి (దేవుత్తని ఏకాదశి) కావడం, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు జరుపుకునే రోజు కావడం, అదేరోజు సుమారు 50 వేల పెళ్లిళ్లు రాష్ట్రంలో జరుగనుండటంతో పోలింగ్ శాతంపై వీటి ప్రభావం పడుతుందని బీజేపీ సహా పలు రాజకీయ పక్షాలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి.
రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, పలు సామాజిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చినందువల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. నవంబర్ 23వ తేదీన రాజస్తాన్ లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు, ఎంగేజ్ మెంట్స్ ఉన్నాయి. అందువల్ల ఆ రోజు పోలింగ్ నిర్వహిస్తే, ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అంతే కాకుండా, పోలింగ్ నిర్వహణకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు అందాయి. అందువల్ల ఆ తేదీని మార్చాలని అభ్యర్థించాయి. దాంతో, ఎన్నికల సంఘం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని రాజస్థాన్ లో పోలింగ్ తేదీని మార్చాలని నిర్ణయించింది.
”వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి విజ్ఞప్తులు అందాయి. వివిధ మీడియా సంస్థలు లేవనెత్తిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. పోలింగ్ తేదీన పెద్దఎత్తున పెళ్లిళ్లు, సామాజిక కార్యక్రమాలు ఉన్నందున ఓటర్లు పార్టిషిషన్ తగ్గే అవకాశం ఉండటంతో ఎన్నికల తేదీని సవరించాలని నిర్ణయించాం” అని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

More Stories
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు
సంతాప తీర్మానంలో విమర్శలపై బిజెపి అభ్యంతరం