అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం

అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‍లో భారత్ వరుసగా రెండో గెలుపును సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ  అద్భుత సెంచరీతో అఫ్గానిస్థాన్‍పై సునాయస విజయాన్ని అందుకుంది టీమిండియా. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‍లో భారత్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‍పై గెలిచింది. 
 
ఏకంగా 90 బంతులను మిగిల్చి విజయం సాధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (84 బంతుల్లో 131 పరుగులు; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకంతో అదరగొట్టాడు. దీంతో 35 ఓవర్లలోనే 2 వికెట్లకు 273 పరుగులు చేసి విజయం సాధించింది భారత్.  విరాట్ కోహ్లీ (56 బంతుల్లో 55 పరుగులు నాటౌట్) అర్ధ శతకంతో అదరగొట్టగా, ఇషాన్ కిషన్ (47) రాణించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో స్టార్ స్పిన్నర్ రషీద్‍ ఖాన్‍కు మాత్రమే రెండు వికెట్లు దక్కాయి. 
 
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఈ గెలుపుతో టీమిండియా ప్రస్తుతం ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది.

రోహిత్ వీర విహారం

కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి వరల్డ్‌కప్‌లో అత్యంత వేగంగా శతకం సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 84 బంతుల్లోనూ 16 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 131 పరుగులు చేశాడు.  అంతేగాక వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ వరల్డ్‌కప్‌లో ఏడో సెంచరీని సాధించాడు.

ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆరు శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు. విండీస్ స్టార్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 553 అత్యధిక సిక్సర్ల రికార్డును హిట్‌మ్యాన్ తిరగరాశాడు. ఇవే కాకుండా వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 

రోహిత్ ప్రస్తుతం 31 శతకాలతో మూడో స్థానంలో నిలిచాడు. భారత స్టార్లు సచిన్ (49), కోహ్లి (47) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అంతేగాక వన్డే వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని కూడా రోహిత్ అందుకున్నాడు.