స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారం చంద్రబాబును కోర్టులో వ్యక్తిగతంగా హాజరుపర్చాలని ఆదేశించింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 లోపు కోర్టులో హాజరుపరచాలని పేర్కొంది.
ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్లపై ఉదయం నుంచి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో రేపు క్వాష్ పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలో తీర్పు రేపటికి వాయిదా వేయమని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
సీఐడీకి సంబంధించిన న్యాయవాదులు వచ్చిన తర్వాత వాళ్ల అభిప్రాయం కూడా తీసుకొని నిర్ణయం చెబుతానని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చివరికి పీటీ వారెంట్‌పై విచారణకు ఏసీబీ కోర్టు సమ్మతించింది.
కాగా, అంగళ్లు కేసులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
లోకేష్‌కు హైకోర్టులో భారీ ఊరట
మరోవంక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా, మధ్యాహ్నం లోకేశ్ పై కౌశల్ కేసును హైకోర్టు ముగించింది. దీంతో లోకేష్‌కు పెద్ద ఊరట లభించింది.
ఈ కేసులో లోకేశ్ ను ముద్దాయిగా చూపలేదని కోర్టుకు తెలిపింది ఏపీ సీఐడీ. ముద్దాయిగా చూపని కారణంగా అరెస్ట్ చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది. స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ధర్మాసనం గురువారం వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిపిన కోర్టు లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఒకవేళ కేసులో నారా లోకేశ్ పేరును చేర్చితే 41ఏ నిబంధనలు అనుసరిస్తామని తెలిపింది ఏపీ సీఐడీ. ఫలితంగా లోకేశ్ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం