మలేషియా, సింగపూర్‌లకు భారత్‌లో కెనడా దౌత్యవేత్తలు

భారత్‌లో తన దౌత్యవేత్తలను ఆగ్నేయాసియా దేశాలకు కెనడా తరలించింది. భారత్‌ నుండి పలువురు దౌత్యవేత్తలను కెనడా వెనక్కి పిలిపించింది. భారత్‌లోని  తమ దౌత్యవేత్తలను మలేషియా,  సింగపూర్‌లకు పంపినట్లు కెనడాలోని మీడియా తెలిపింది.  న్యూఢిల్లీ వెలుపల భారత్‌లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలలో అధిక శాతం మందిని  మలేషియా,  సింగపూర్‌లకు తరలించినట్లు స్థానిక మీడియా సిటివి న్యూస్‌ తెలిపింది.
 
ఇరు దేశాల్లో దౌత్యవేత్తల సంఖ్యలో సమతూకం పాటించేందుకు భారత్‌లో ఉంటున్న 62 మంది దౌత్యవేత్తల్లో 41 మందిని అక్టోబర్‌ 10నాటికి ఉపసంహరించాల్సిందిగా కెనడాను భారత ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యధిక దౌత్యవేత్తలను మలేషియాలోని కౌలాలంపూర్‌ లేదా సింగపూర్‌కు కెనడా తరలించినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. 
 
అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే దౌత్యవేత్తల తగ్గింపు అంశంపై భారత్‌తో తాము దౌత్యపరంగా వ్యవహరిస్తున్నట్టు కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి మెలనీ జోలి తెలిపారు. ఖలిస్తానీ  వేర్పాటువాద నేత  హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌  హత్యతో భారత్‌, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే.  
 
దీంతో అక్టోబర్‌ 10 నాటికి సుమారు 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్‌ కోరిందని జాతీయ మీడియా నివేదించింది. గడువు ముగిసిన తర్వాత దేశంలో ఉన్న కెనడియన్‌ దౌత్యవేత్తల దౌత్యపరమైన అధికారాలను తొలగిస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించిందని పేర్కొంది.