నిబంధనలు అన్నింటిని గాలికి వదిలేసి, అడ్డదిడ్డంగా వందకు పైగా చర్చిలకు ప్రాతినిధ్యం వహించే ఒకరిని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న జేమ్స్ స్టీఫెన్ ఇప్పటికే వర్సిటీలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్‌గా అక్రమంగా నియమించారు. తాజాగా బుధవారం నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు అదనంగా (అడిషనల్ చార్జ్) కీలకమైన రిజిస్ర్టార్ బాధ్యతలు కట్టబెట్టారు.
దేశంలోనే స్వతంత్రంకు ముందే వెలిసిన యూనివర్సిటీలలో ఒకటైన ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నప్పటికీ, వారందరినీ పక్కనపెట్టి ప్రైవేటు కళాశాల నుంచి అడ్డదారిలో వచ్చిన జేమ్స్ స్టీఫెన్‌కు కీలకమైన రిజిస్ట్రార్ పదవి కట్టబెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సుమారు వందేళ్ల యూనివర్సిటీ చరిత్రలోనే ఇదొక్క కళంకంగా భావిస్తున్నారు.
ఇప్పటికే అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ వీసీ ప్రసాదరెడ్డి ఈ నియామకంలో కీలక పాత్ర వహించినట్లు చెబుతున్నారు. స్టీఫెన్ ఉత్తరాంధ్రలో కీలకమైన సుమారు 100కు పైగా చర్చిలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే పాస్టర్లంతా ఆయన శిష్యులే.
ఆయా చర్చిల పరిధిలో గల ఓటర్లను వైసీపీకి అనుకూలంగా మలుస్తారనే ఉద్దేశంతోనే స్టీఫెన్‌కు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దల సహకారంతో ఏయూ ఉన్నతాధికారి పదవులు కట్టబెడుతున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతానికి అదనపు బాధ్యతలు అప్పగించినప్పటికీ త్వరలో పూర్తిస్థాయి రిజిస్ర్టార్‌గా నియమిస్తూ ఆదేశాలు వెలువడవచ్చునని చెబుతున్నారు.
విశాఖపట్టణం పరిధిలోని వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా జేమ్స్ స్టీఫెన్ పనిచేస్తుండేవారు. ఏయూ వైస్ చాన్సలర్‌గా ప్రసాదరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత వర్సిటీ పాలకమండలి సభ్యుడిగా మొదట ఆయన నియమితులయ్యారు. ఆ తరువాత ప్రసాదరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్‌గా స్టీఫెన్‌ను నియమించారు.
సాధారణంగా అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్‌గా నియమితులు కావాలంటే లా, ఆర్ట్స్, కామర్స్‌లలో పీహెచ్డీ చేసి ఉండాలి. కానీ స్టీఫెన్ ఆ విభాగాల్లో పీహెచ్డీ చేయలేదు. కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ తీసుకున్న ఆయనకు ప్రసాదరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఆ బాధ్యతలు అప్పగించారు. ఏయూ రిజిస్ర్టార్ పోస్టు ఖాళీ కావడంతో దానిని స్టీఫెన్‌కు కట్టబెట్టేందుకుఇప్పుడు పావులు కదిపారు.
సాధారణంగా యూజీసీ స్కేల్ తీసుకునే సీనియర్ ప్రొఫెసర్ మాత్రమే రిజిస్ర్టార్ పోస్టుకు అర్హులు. కానీ స్టీఫెన్ ఏనాడూ యూజీసీ స్కేల్ (వేతనం) తీసుకోలేదు. ఈ నేపథ్యంలో స్టీఫెన్‌కు రిజిస్ర్టార్ పదవి ఇస్తే సీనియర్ ప్రొఫెసర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముందని భావించిన వీసీ అందుకు అనుగుణమైన వాతావరణం కల్పించేందుకు ముగ్గురు అధికారులతో ఒక కమిటీని వేశారు.
ప్రైవేటు కాలేజీలో పనిచేసినప్పుడు యూజీసీ స్కేల్ తీసుకోకపోయినా తీసుకున్నట్టు చూపేందుకు సదరు కమిటీ యత్నించిందని సీనియర్ ప్రొఫెసర్లు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో సుమారు 100 మందికిపైగా సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నా వారిని కాదని బయటి వ్యక్తికి వర్సిటీ కస్టోడియన్‌గా వ్యవహరించే రిజిస్ర్టార్ బాధ్యతలను అప్పగించడమంటే సీనియర్లను అవమానించినట్టేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నియామకంపై రగిలిపోతున్న పలువురు సీనియర్ ప్రొఫెసర్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. బుధవారం స్టీఫెన్ బాధ్యతలు స్వీకరించగా ఈ కార్యక్రమానికి సీనియర్ ప్రొఫెసర్లు దూరంగా ఉన్నారు.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ