చంద్రబాబుకు మూడోసారీ రిమాండ్ పొడిగింపు

చంద్రబాబుకు మూడోసారీ రిమాండ్ పొడిగింపు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడుకు మరోసారి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. ఈసారి మరో 14 రోజుల రిమాండ్‌ను విధించింది న్యాయస్థానం. అంటే ఈనెల 19 వరకు చంద్రబాబు జైల్‌లో ఉండాల్సిందేనని న్యాయస్థానం వెల్లడించింది. 
 
 ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించిన సంగతి తెలిసిందే. మొదట న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించగా, ఆ గడువు ముగిశాక మరో రెండు రోజుల పాటు పొడిగించింది. ఆ గడువు కూడా సెప్టెంబర్ 24తో ముగియగా, మళ్లీ 11 రోజులు అంటే అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించింది. 
 
ఆ గడువు కూడా గురువారంతో  ముగియగా.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మరో 14 రోజుల పాటు రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. మరోవంక, స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం కూడా విచారణ వాయిదా పడింది. 

తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు తరుపున ప్రమోద్ దూబే, సీఐడీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాదనల అనంతరం కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లిన నిధులకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. టీడీపీ బ్యాంక్ ఖాతాలకు రూ.27 కోట్లు మళ్లించారని ఆధారాలు చూపించారు. ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన సంభాషణలను ప్రభుత్వ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి ముందు ఉంచారు. 

సీఐడీ వద్ద ఉన్న ఫైళ్లను న్యాయమూర్తికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చూపించారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదని, ఒప్పందంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. కొన్ని బ్యాంక్ లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు.

చంద్రబాబును కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని కోరారు. చంద్రబాబు రిమాండ్‌ను పొడగించాలని, 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేశారు. మరోవైపు,  ఫైబర్ నెట్ స్కాం కేసులో బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్‌ విషయంలో ఇరువైపులా న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించాచారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది.