అస్సాం ఎన్‌ఆర్‌సిలో అక్రమాలపై చర్యలు తీసుకోండి

అస్సాం ఎన్‌ఆర్‌సిలో అక్రమాలపై చర్యలు తీసుకోండి
భారతదేశంలోని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) అప్‌డేషన్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రతిపాదించిన అన్ని  ఎఫ్‌ఐఆర్‌లను ఆమోదించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను భారతదేశాన్ని అక్రమ వలస రహిత దేశంగా మార్చడానికి అంకితమైన జాతీయ సంస్థ  భారత్ రక్షా మంచ్ డిమాండ్ చేసింది.
 
ఎన్‌ఆర్‌సి  ముసాయిదా పూర్తి రీ-వెరిఫికేషన్ కోసం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి శర్మకు సమర్పించిన వినతిపత్రంలో మాజీ   ఎన్‌ఆర్‌సి  రాష్ట్ర సమన్వయకర్త ప్రతీక్ హజెలాపై కనీసం ఐదు ఎఫ్ఐఆర్ లను  నమోదయిన్నట్లు గుర్తు చేసింది. 
 
హజెలా ముందస్తు పదవీ విరమణతో వెళ్ళినట్లు కనిపిస్తున్నప్పటికీ, అస్సాం పోలీసులు ఈ రోజు వరకు ఒక్క ఎఫ్ఐఆర్ లో కూడా ముందుకు సాగడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌సి అప్‌డేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన రాష్ట్ర హోం & పొలిటికల్ డిపార్ట్‌మెంట్ కమీషనర్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించాలని కూడా మంచ్ డిమాండ్ చేసింది.  ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఫార్సు  చేసిందని వారు గుర్తు చేశారు.
 
దేశవ్యాప్తంగా జాతీయస్థాయిలో పౌరుల రిజిస్టర్ తయారు చేయాలని డిమాండ్ చేస్తున్న భారత్ రక్షా మంచ్ అక్టోబర్ 2న ఈ విషయమై నిరసన ప్రదర్శనలు జరిపింది. అస్సాంలో అక్రమాలకు పాల్పడిన హజెలా తదితరులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
 గౌహతి, అగర్తల, కోల్‌కతా, పాట్నా, జంషెడ్‌పూర్, భోపాల్, ముంబై, నాగ్‌పూర్, నాసిక్, డెహ్రాడూన్, జమ్మూ మొదలైన ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అస్సాం ఎన్‌ఆర్‌సి అప్‌డేషన్ కుంభకోణంలో రూ. 260 కోట్ల మేరకు అక్రమాలకు పాల్పడడంతో పాటు లక్షలాది అక్రమ బంగ్లాదేశ్ పౌరుల పేర్లను ముసాయిదాలో చేర్చిన పలువురు అధికారులు ఇప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
వారిలో హజెలాతో పాటు,  అతని తక్షణ వారసుడు హితేష్ దేవశర్మ (సిఐడి, విజిలెన్స్ & యాంటీ కరప్షన్, అస్సాం), అభిజిత్ శర్మ (పల్టాన్ బజార్ పోలీస్ స్టేషన్), లూయిట్ కుమార్ బర్మాన్ (పల్టాన్ బజార్ పోలీస్ స్టేషన్), గితికా భట్టాచార్య (దిస్పూర్ పోలీస్ స్టేషన్) లు ఉన్నారు.  వీరిపై  ఫిర్యాదులను నమోదు చేయకపోవడానికి తమకు ఎటువంటి కారణం కనిపించడం లేదని భారత్ రక్షా మంచ్ అస్సాం అధ్యక్షుడు ద్విజేంద్ర ఎన్  బోర్తకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
తాము ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం గవర్నర్ జిసి కటారియాలకు కలిసి ఈ డిమాండ్ల విషయమై వినతిపత్రాలు సమర్పించిన్నట్లు ఆయన చెప్పారు.