
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తరపుణ దాఖలైన క్వాష్ పిటిషన్ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
బాబు తరపున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఆ తర్వాత సిద్ధార్థ లుథ్రా, అభిషేక సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని, జ్యుడిషియల్ రిమాండ్ రద్దు చేయాలని, విచారణ నిలిపివేయాలని బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం విచారణ ప్రక్రియ చెల్లదని సాల్వే వాదించారు.
2021 డిసెంబర్ 9న స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో విచారణ ప్రారంభమైందని సాల్వే వివరించారు. సెప్టెంబర్ 7వ తేదీన ఏడీజీపీకి రాసిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేశారని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని విశ్వాసఘాతుకానికి బాబు పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేశారని సాల్వే పేర్కొన్నారు. అదే సమయంలో సెక్షన్ 17ఏలో స్పష్టమైన నిర్వచనం ఇచ్చారని, అధికార దుర్వినియోగం విషయంలో చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉందని, కక్ష సాధింపులో భాగంగానే కేసులు నమోదు చేశారని సాల్వే ధర్మసనానికి వివరించారు.
విచారణ సందర్భంగా సెక్షన్ 17ఏ నిర్వచనాన్ని సాల్వే చదివి వినిపించారు. సెక్షన్ 17ఏ ప్రభుత్వ ఉద్యోగి విధులకు సంబంధించినదిగా పేర్కొన్నారు. ఈ క్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ 2015-16 మధ్య కాలంలో జరిగిందని జస్టిస్ ద్వివేది గుర్తు చేశారు. సెక్షన్ 17ఏకు చట్ట సవరణలు 2018 జరిగాయని స్పష్టం చేశారు. దీంతో సాల్వే స్కిల్ వ్యవహారంలో విచారణ చట్ట సవరణ తర్వాతే మొదలైందని చెప్పారు. ఈ వ్యవహారంలో నేరం జరిగిన సమయంతో సంబంధం లేదని, విచారణ ప్రారంభమైన సమయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.
సెక్షన్ 17ఏను 2018 జులై కు ముందు జరిగిన నేరాలకు వర్తింప చేయడంలో అర్థం లేదని సాల్వే వాదించారు. నేరం జరిగిన తేదీలతో సంబంధం లేదని, సెక్షన్ 17ఏ ప్రకారం చట్టపరమైన రక్షణలు పిటిషనర్‌కు వర్తిస్తాయని సాల్వే పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ క్యాబినెట్ అమోదం లేకుండా ఏర్పడిందని, అందులో నియమకాలు బాబు జోక్యంతో జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించిందని సాల్వే పేర్కొన్నారు.
గవర్నర్ అమోదంతో ఈ విచారణ ప్రారంభమైందా లేదా అనేది కూడా స్పష్టం చేయాలని కోరారు. ఈ క్రమంలో విచారణ ప్రారంభ తేదీనే పరిగణలోకి తీసుకోవాలా అని జస్టిస్ బోస్ ప్రశ్నించడంతో సాల్వే అవునని బదులిచ్చారు. సెక్షన్ 17ఏ ద్వారా విధాన నిర్ణేతలకు రక్షణ కల్పించాలనే పార్లమెంటు లక్ష్యాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరించారని బాబు తరపుణ హాజరైన మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోర్టులో పేర్కొన్నారు.
యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పును ఈ కేసుకు కచ్చితంగా వర్తించి తీరుతుందని చెప్పారు. ట్రాప్ కేసు తప్ప మిగిలిన ఆరు రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుందని, 2015 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలపై ఆరోపణలు ఉన్నాయని, చట్ట సవరణ తర్వాత మరో ఏడాది కాల వ్యవధిని ఈ కేసులో చేర్చారని తెలిపారు. 2018లో చట్టసవరణ జరిగితే 2019లో జరిగిన నిర్ణయాలను కేసు పరిధిలోకి తీసుకురాలేరన్నారు.
మరోవైపు ఏపీ సిఐడి తరపున హాజరైన ముఖుల్ రోహత్గీ చంద్రబాబు వ్యవహారంలో 17ఏ ప్రశ్న తలెత్తదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తుకు సంబంధించిన అన్ని వివరాలను సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ వచ్చే వారానికి విచారణ వాయిదా వేసింది. హైకోర్టులో సమర్పించిన పత్రాలు మొత్తం సుప్రీం కోర్టులో అప్పగించాలని ఆదేశించారు.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేయకుండా స్క్వాష్ పిటిషన్ వేయడంపై రోహత్గీ అభ్యంతరం తెలిపారు. కోర్టు విచారణ వాయిదా వేయడంతో వెంటనే విచారణ చేపట్టాలని లుథ్రా కోరారు. చంద్రబాబు జైల్లో ఉన్నందున వెంటనే విచారణ జరపాలని ధర్మాసనాన్ని వేడుకున్నారు. సోమవారం అన్ని అంశాలను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ