ఆసియా క్రీడల్లో సత్తాచాటిన తెలంగాణ గురుకుల అథ్లెట్‌

ఆసియా క్రీడల్లో సత్తాచాటిన తెలంగాణ గురుకుల అథ్లెట్‌
చాయ్‌వాలా కూతురు నందిని ఆసియా గేమ్స్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. చెక్కు చెదరని పట్టుదలతో ఏడు పోటీల్లో అసమాన ప్రదర్శన కనబరిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన హెప్టాథ్లాన్‌ ఫైనల్లో 57-12 పాయింట్లతో నందిని మూడో స్థానంలో నిలిచింది. తద్వారా తెలంగాణ నుంచి అథ్లెటిక్స్‌లో పతకం గెలిచి దేశ, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి అగసర నందిని హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకాన్ని ఛేజిక్కికుంది. నందిని సంగారెడ్డి లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో బిబిఎ రెండో సంవత్సరం చదువుతోంది. నార్సింగి లోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుకున్నది.
 
నందిని సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి యల్లయ్య చాయి (టీ) అమ్ముతూ తన కూతురును గురుకుల పాఠశాలలో చేర్పించారు. నందిని విద్యలో రాణిస్తూనే క్రీడా రంగంపై ఆసక్తి పెంచుకుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆసియా క్రీడలకు ఎంపికైంది. నందిని వివిధ అంతర్జాతీయ వేదికల్లో నిరంతరం తన అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శిస్తోంది.
 
ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో నిఖత్‌ జరీన్‌, అథ్లెటిక్స్‌లో అగసర నందిని కాంస్య పతకాలు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు బిడ్డలు రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని కొనియాడారు. గురుకులాలు ఇప్పటికే విద్యారంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా ఆసియా క్రీడలలోనూ మన విద్యార్థులు మెరవడం గొప్ప విషయమని సీఎం వెల్లడించారు.
 
కాగా, రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌, తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నిఖత్‌ సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన రక్సత్‌ చుథామట్‌ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది.  తొలిరౌండ్‌లో 3-2తో ఆధిక్యంలో ఉన్న జరీన్‌ రెండో రౌండ్‌లో వెనకబడింది. మూడోరౌండ్‌లో అంపైర్‌ నిర్ణయంతో రక్సత్‌ ఫైనల్‌కు చేరింది. దాంతో, ఇందూరు బిడ్డ కాంస్య పతకం సొంతం చేసుకుంది.
 
మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలుగు తేజం జ్యోతి ఎర్రోజు వెండి పతకంతో సత్తా చాటింది. అయితే.. రేసుకు ముందు హైడ్రామా నెలకొంది. స్టార్టింగ్‌ సిగ్నల్‌ కంటే ముందే పరుగెత్తారనే నెపంతో చైనా అథ్లెట్‌ యన్ని వూతో పాటు జ్యోతిని అధికారులు పక్కన నిల్చోమన్నారు. 
 
దాంతో, వూ, జ్యోతి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో రేసు కాసేపు నిలిచిపోయింది. రిప్లేలో జ్యోతి చేతులు నేలకు ఆనించి ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత మొదలైన రేసులో వూ రెండు, జ్యోతి 12.91 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. కానీ, ఫౌల్‌ మరోసారి ఫౌల్‌కు పాల్పడడంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో అనూహ్యంగా జ్యోతికి వెండి దక్కింది.