కరోనా టీకా కోసం కృషి చేసిన ఇద్దరికి నోబెల్​ బహుమతి!

కరోనా టీకా కోసం కృషి చేసిన ఇద్దరికి నోబెల్​ బహుమతి!
కరోనాపై అంతులేని పోరాటం చేసి, టీకా వృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు 2023 నోబెల్​ బహుమతి వరించింది. వైద్య రంగానికి సంబంధించిన ఈ విభాగంలో  కాటలిన్​ కారికో, డ్రూ వైస్​మెన్​లకు నోబెల్​ అవార్డు దక్కింది. ఈ మేరకు నోబెల్​ బహుమతి అధికారిక ట్విట్టర్​ ఖాతా నుంచి ఓ ప్రకటన వెలువడింది. 
 
కరోనా సమయంలో న్యూక్లియోసైడ్​ బేస్​ మాడిఫికేషన్లను వీరిద్దరు కనుగొన్నారు. దీని వల్ల కరోనా పై పోరాటానికి కీలకమైన, సమర్థవంతమైన ఫైజర్​ వంటి వ్యాక్సిన్​లను ప్రపంచం పొందగలిగింది. శాస్త్ర పరిశోధక రంగానికి సవాలుగా నిలిచిన న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులపై వీరు చేపట్టిన పరిశోధనలు విజయవంతం అయ్యాయి. 
 
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఎంఆర్ఎన్ఏ సాంకేతికతో రూపొందించే వ్యాక్సిన్ల తయారీకి వీరి పరిశోధనలు మరింత ఊతమివ్వనున్నాయి. “ఫిజియాలాజీ/ వైద్య రంగంలో 2023 నోబెల్​ ప్రైజ్​ను కాటలిన్​ కారికో, డ్రూ వైస్​మెన్​లకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. కరోనా ​ టీకా తయారీలో వారి పాత్రకు ఈ అవార్డు ఇస్తున్నాము,” అని స్వీడెన్​లోని నోబెల్​ అసెంబ్లీ పేర్కొంది.
 
కేటలిన్ కరికో హంగేరియన్-అమెరికన్ బయోకెమిస్ట్. ఆమె ఆర్ఎన్ఏ ఆధారిత జీవ వ్యవస్థలపై స్పెషలైజేషన్ చేశారు. ఇక, డ్రూ వీస్ మన్ అమెరికా వైద్యుడు, శాస్త్రవేత్త. ఆర్ఎన్ఏ బయాలజీ పరిశోధక రంగంలో విశిష్ట సేవలందించారు. కరోనా సంక్షోభ సమయంలో బయో ఎన్ టెక్, ఫైజర్, మోడెర్నా వంటి ఫార్మా సంస్థల వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడంలో డ్రూ వీస్ మన్ కృషి ఉంది.
వైద్య రంగంలో అత్యున్నత పురస్కారంగా దీనిని పరిగణిస్తారు. బహుమతితో పాటు ఈసారి విజేతలకు 11 మిలియన్​ స్వీడిష్​ క్రౌన్​ (1 మిలియన్​ డాలర్​) నగదు కూడా లభిస్తుంది. అంటే ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 8.3కోట్లు. ఈ నోబెల్​ అవార్డులను 1901 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. 

స్వీడెన్​కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ఆల్​ఫ్రెడ్​ నోబెల్​ వీటిని ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ అవార్డులను కొనసాగిస్తున్నారు. వైద్యం, శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక విభాగాల్లో నోబెల్​ బహుమతిని ప్రకటిస్తారు. ఈసారి వైద్య రంగంతో ఈ అవార్డు ప్రకటన మొదలైంది. రానున్న రోజుల్లో ఇతర బహుమతులను ప్రకటిస్తారు. స్టాక్​హోంలో ఈ ఏడాది డిసెంబర్​ 10న జరగనున్న కార్యక్రమంలో  స్వీడెన్​ రాజు చేతుల మీదుగా. విజేతలు బహుమతులను, నగదును అందుకుంటారు.