గుంటూరులో అర్చకుల మూకుమ్మడి ధర్నా

గుంటూరులో అర్చకుల మూకుమ్మడి ధర్నా
గుంటూరు నగరంలో గోరంట్ల ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అర్చకుడు నందివెలుగు సాయి చరణ్ (బాధితుడు)ను అనారోగ్య కారణాలు రీత్యా సెలవు అడిగిన పాపానికి ఆలయ కార్యదర్శి మేడ సాంబశివరావు, మేనేజర్ చలంచర్ల లక్ష్మీనారాయణలు అర్చక వృత్తిని, బ్రాహ్మణ కులాన్ని అసభ్యకరంగా దూషించిందే కాక కర్ర తీసుకొని దాడి చేయటాన్ని నిరసిస్తూ శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గం.ల వరకు నిరసన ధర్నాను జరిపారు. 
 
రాష్ట్ర అర్చక సేవా సంఘం, బ్రాహ్మణ చైతన్య వేదిక, రాష్ట్ర ఆది శైవ సంఘం, రాష్ట్ర వైఖానస సంఘం ఆధ్వర్యంలో భక్తులు, దాతలు సమక్షంలో ముకుముడిగా దేవాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, సిరిపురపు శ్రీధర్ శర్మ, పత్రి అనిల్ కుమార్, మేడూరు శ్రీనివాసమూర్తి  మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అర్చకులు పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
రెండు మూడు నెలల కాలంలోనే ఇది నాలుగో సంఘటనని చెబుతూ గతంలో భీమవరం, రాజమండ్రి, కదిరిలలో ఉన్న ప్రధాన దేవాలయాల్లో అర్చకులపై దాడులు ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు చేయడం గురించి గుర్తు చేశారు. ఇప్పుడు గుంటూరులో అర్చకుడుపై దాడి చేయడం నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ దాడులు అర్చకులపై ఇలానే కొనసాగితే భవిష్యత్తులో దేవాలయాల్లో పనిచేయడానికి అర్చకులు ఎవరు రారని, దానివల్ల దేవాలయ వ్యవస్థ పూర్తిగా కునారిల్లిపోతుందని హెచ్చరించారు. దీనిపైన అన్ని సామాజిక వర్గాల్లో చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.  సనాతన దేవాలయ వ్యవస్థ బతికి బాగుండాలంటే అర్చకుల్ని గౌరవంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల వారిపై ఉందని తెలిపారు. 
 
కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ దేవాలయంలో అర్చకులకు, సిబ్బందికి రక్షణ లేనప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుందని వారు ప్రశ్నించారు. తక్షణమే దేవాదాయ శాఖ వారు తమ ఆధీనంలోకి ఈ దేవాలయం తీసుకొని అర్చకులు రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు.
 
అర్చకులకు దేవాలయ వ్యవస్థకు తమ సంఘాలు ఎప్పుడు అండగా ఉంటాయని ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే తమ దృష్టికి తేవాలని తెలియజేశారు. తొలుత ఈ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు, కృష్ణ శర్మ తదితరులు స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రధాన దేవాలయం, ఉపాలయాలు మూసివేసి, తాళాలు వేసి ధర్నాకు సంఘీభావం తెలియజేసి, ధర్నాలో కూడా పాల్గొన్నారు.