
యావత్ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న శాంతి, భద్రతల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 19 పోలీస్ స్టేషన్ ప్రాంతాలపై మాత్రం ఆ ఆంక్షలను మినహాయించారు. కల్లోలిత ప్రాంతాలలో రాష్ట్ర రాజధాని ఇంఫాల్, లాంపెల్, సిటీ, సింగజేమి, సేక్మాయి, లాంసంగ్, పాత్సోయి, వాంగోయి, పోరాంప్ట్, హెయిన్‌గ్యాంగ్, లాంలాయి, ఇరిల్‌బంత్, లీమాఖాంగ్, తౌబాల్, బిష్ణుపుర్, నంబోల్, మొయిరాంగ్, కాక్‌చింగ్, జీరిబమ్ ఉన్నాయి.
ఆరు నెలల పాటు ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితినే కొనసాగించనున్నారు. మణిపూర్‌లో ఈ ఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు బయటకు రావడంతో సాయుధ మూకల చేతిలో వారు హత్యకు గురైనట్లు తేలింది. వారి మృతదేహాల ఫొటోలు ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేయడంతో వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
రాష్ట్రంలోని విద్యార్థులు ఘటనకు నిరసనగా మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజధాని ఇంపాల్‌లో వందలాది మంది విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. బుధవారం కూడా వారు తమ నిరసనలను కొనసాగించారు. ఇంపాల్ వీధుల్లో విద్యార్థుల మృతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు నిరసన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 50 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీస్‌లు లాఠీ ఛార్జి చేయడంతో 30 మంది గాయపడ్డారని , వారిలో ఎక్కువ మంది బాలికలే ఉన్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.మరోవైపు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మళ్లీ మెబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. అక్టోబర్ 1 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్