ముదురుతున్న కావేరీ జలాల వివాదం

ముదురుతున్న కావేరీ జలాల వివాదం
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం ముదురుతున్నది. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ కర్ణాటక జల సంరక్షణ సమితి బెంగళూరు నగర బంద్‌ కార్యక్రమం మంగళవారం చేపట్టింది. కురుబురు శాంతకుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ బంద్‌లో రాష్ర్టానికి చెందిన రైతు, ఇతర సంఘాలు పాల్గొన్నాయి.

తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయొద్దని, కరువు కాలంలో పరిస్థితులను అంచనా వేయడానికి ఈసీ వంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని, మేకదాతు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం బెంగళూరులోని విధానసౌధనుంచి రాజ్‌భవన్‌కు నిరసనకారులు ప్రదర్శన చేపట్టగా నిఫేధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణంగా దాదాపు 1000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నగరమంతటా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దాదాపు 1000 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ బి దయానంద చెప్పారు. ఈ బంద్‌కు బిజెపి, జెడి(ఎస్) మద్దతు ప్రకటించాయి.

కాగా బంద్ దృష్టా నగరంలోఅత్యవసర సర్వీసులు మినహా అన్ని దుకాణాలను మూసివేశారు.సిటీ బస్సులతో పాటుగా అన్ని రవాణా వాహనాలు నిలిచిపోయాయి.పాఠశాలు, కళాశాలకు సెలవు ప్రకటిస్తూ అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కె ఎ దయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ ఐటి సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటివద్దనుంచే పని చేయాలని సూచించాయి.

ప్రభుత్వం మూడు రోజుల్లోగా ఓ నిర్ణయాన్ని ప్రకటించాలని శాంత కుమార్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నగరంలోని సాధారణ జనజీవనంపై బంద్‌ ప్రభావం పడింది. నగరంలోని విద్యాసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి.  సెప్టెంబర్‌ 13 నుంచి 15 రోజుల పాటు తమిళనాడుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో కలుగజేసుకొనేందుకు ఈనెల 21న సుప్రీంకోర్టు తిరస్కరించింది.

మరోవంక, జల వివాదంపై ‘కన్నడ ఒక్కుత’ సంఘం శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం నాటి బంద్‌కు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో తమ ప్రభుత్వానికి రాజీ లేదని పేర్కొన్నారు. కాగా, ఆందోళనలతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ కోరారు.