మొబైల్స్‌కు ఎమర్జెన్సీ అలర్ట్.. ఆందోళన చెందకండి

మొబైల్స్‌కు ఎమర్జెన్సీ అలర్ట్.. ఆందోళన చెందకండి
దేశవ్యాప్తంగా గురువారం కొందరు మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊహించని అనుభవం ఎదురైంది. వారి ఫోన్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్దగా మోత పెట్టాయి. అలారమ్ మాదిరిగా అలా రింగ్ సౌండ్ వస్తూ, ఫోన్ వైబ్రేట్ కావడంతో ఏమైందో తెలియక అయోమయానికి, భయాందోళనకు గురయ్యారు. అవగాహన లేని వారు ఫోన్ కు దూరంగా వెళ్లడం జరిగింది. ఆఫ్ చేసే వరకు ఆ అలర్ట్ మోగుతూనే ఉంది.
 
అయితే, గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా గురువారం చాలా మంది మొబైల్‌ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్‌ సందేశం వచ్చింది. ‘తీవ్ర పరిస్థితి’ అన్న అర్థంతో ఆ ఫ్లాష్‌ మెసేజ్‌ ఉంది.  ఈ మెసేజ్‌తోపాటు పెద్దగా బీప్‌ సౌండ్‌ కూడా రావడంతో అంతా ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఈ మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందో..? ఎందుకు వచ్చిందో..? ఎవరు పంపారో..? తెలియక అంతా గందరగోళానికి గురయ్యాయి. 
 
అయితే, ఈ మెసేజెస్‌తో భయపడాల్సిన పని లేదు. ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్‌ వచ్చినట్లు ప్రభుత్వం తెలిసింది.  రాబోయే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం మొబైల్‌ ఫోన్లలో కొత్త ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా మంది యూజర్లపై సిస్టమ్‌ పనితీరును టెస్ట్‌ చేయడం మొదలు పెట్టింది. 
 
ఇందులో భాగంగానే యూజర్లకు సెక్యూరిటీ మెసేజ్‌ అలర్ట్‌ పంపుతోంది. విపత్తుల గురించి ప్రజలను హెచ్చరించేందుకు యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడు భారత్‌ కూడా అలాంటి వ్యవస్థనే అమల్లోకి తెచ్చేప్రయత్నం చేస్తోంది.  దీన్ని కేంద్ర టెలికం శాఖ పంపించింది. ట్రయల్ లో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సహకారంతో కేంద్ర టెలికం శాఖ మొబైల్ ఫోన్లకు ఈ అలర్ట్ ను పంపించింది. దీనిపై గురువారం ఉదయమే మొబైల్ ఫోన్ వినియోగదారులు అందరికీ ఎస్ఎంఎస్ రూపంలో టెలికం శాఖ ఓ సందేశాన్ని పంపించింది.

‘‘మీ మొబైల్ లో అత్యవసర పరిస్థితికి సంబంధించి టెస్ట్ సందేశాన్ని (ప్రయోగాత్మక సందేశాన్ని) భిన్నమైన శబ్దంతో, వైబ్రేషన్ తో అందుకోవచ్చు. దయచేసి భయపడకండి. ఇది నిజమైన అత్యవసర పరిస్థితిని సూచించదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సహకారంతో భారత టెలికం శాఖ ఈ సందేశాన్ని పంపిస్తోంది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ ట్రయల్ సందేశాన్ని పంపిస్తున్నాం’’అని ఎస్ఎంఎస్ రూపంలో అప్రమత్తం చేసింది.