తొమ్మిదేండ్లుగా నిరుద్యోగుల పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఇక ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైనదని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగులకు సంఘీభావంగా బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టిన `నిరాహారదీక్ష’లో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాటం చేసింది రాష్ట్ర నిరుద్యోగ యువత పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని ధ్వజమెత్తారు.
1969లో తెలంగాణ యువత ఉద్యోగాలు, భవిష్యత్ విషయంలో అనేక పోరాటాలు చేయగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసు తూటాలకు 369 మంది బలయ్యారని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు, విద్యార్థులు చదువు మానేసి `తెలంగాణ కావాలి, ఉద్యోగాలు కావాలి’ అని పోరాటం చేయగా తెలంగాణ రాదేమోనని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదేమోనని 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు యూనివర్సిటీలు కళావిహీనంగా ఉన్నాయని, హాస్టళ్లలో పందికొక్కులు తిరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ వస్తే వర్సిటీల్లో ఖాళీ లెక్చరర్ల పోస్టులు, స్కూళ్లు, కాలేజీల్లో టీచర్ల పోస్టులు భర్తీ అవుతాయని, తమకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఏండ్ల తరబడి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కోర్టు కేసులతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నదని అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
పరీక్షలు నిర్వహించినా ప్రభుత్వ పెద్దల అవినీతి, కేసీఆర్ చేతకానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీకై లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ఆగమైందని ఆందోళన వ్యక్తం చేశారు. 35 లక్షల మంది యువత అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే వారిని గాలికొదిలేశారని అంటూ నిరుద్యోగుల జీవితాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా కేసీఆర్? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
దానిపై పోరాటం చేస్తే గతంలో బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయ్ మీద కేసులు పెట్టారని దుయ్యబట్టారు. అవినీతి కుంభకోణాలు మీవి, చేతకాని తనం మీది, లీకేజీలు మీవి? కేసులు మా మీద పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ వేస్తాం.. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
టీచర్ పోస్టులు 25 వేలు ఖాళీలు ఉన్నాయి కదా? ఏమైంది? తొమ్మిదేండ్లుగా డీఎస్సీ వేయలేదు ఈ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఉద్యోగం ఇస్తా.. ఉద్యోగం ఇవ్వకుంటే.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా.. రూ. 3016 ఇస్తానన్నావ్ ఏమైంది? ఎక్కడ పోయింది రూ. 3016? అంటూ కేసీఆర్ ను నిలదీశారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. కానీ మొన్న ఏం రవీందర్ అనే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడని అంటూ అది మీ పాపం కాదా? అని కేసీఆర్ ను నిలదీశారు. ఆయనది ఆత్మహత్య కాదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని స్పష్టం చేశారు.
పరిశ్రమలు తెరుస్తామని చెప్పారని, కనై వరంగల్‌లో రెయిన్స్ పరిశ్రమ, కాగజ్‌నగర్‌లో పేపర్ మిల్లు సహా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, ఒక్క పరిశ్రమ తెరవలేదని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. ఎవరైనా వ్యాపారం చేయాలంటే, సంస్థలు ప్రొడక్షన్ చేసుకోవాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులకు వాటాలు ఇవ్వనిదే కొత్త పరిశ్రమలు ఇక్కడ పెట్టే పరిస్థితి లేదని అంటూ ఆరోపించారు.
నిధులు, నీళ్లు , నియామకాలు ఏమైపోయాయి? నీళ్లు.. కేసీఆర్ మాటలు నీటి మూటలైపోయాయి కానీ.. తెలంగాణకు నీళ్లు రాలేదు. చేపట్టిన చేపడుతున్న ప్రాజెక్టుల్లో కమీషన్లతో కుమ్మక్కై ప్రజాధనం కొల్లగొట్టారని విమర్శించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇవాళ అప్పులపాలై దివాళ తీసే స్థితికొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

More Stories
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్‌లో 17వ నంబర్ భవనం
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రెడ్ కారిడార్: అశాంతి ముగింపుకు భారతదేశ సుదీర్ఘ యుద్ధం