ఇద్దరు తమిళ మంత్రులను తొలగించమన్న బిజెపి

ఇద్దరు తమిళ మంత్రులను తొలగించమన్న బిజెపి
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మత చిచ్చు రగిల్చేలా విమర్శలు చేసిన రాష్ట్ర మంత్రి ఉదయనిధిని మంత్రి వర్గం నుండి తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరు నాగరాజన్‌, పాల్‌ కనకరాజ్‌, కార్యదర్శి అశ్వత్థామన్‌, టడా పెరియసామి, ఎం.నాచ్చియప్పన్‌ తదితరులు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. 
 
నగరంలో ద్రవిడ కళగం, అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన సనాతన ధర్మ నిర్మూలన మహానాడులో ప్రసంగించిన ఉదయనిధిని, ఆ సభకు హాజరైన దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబును కూడా మంత్రి పదవుల నుండి బర్తరఫ్‌ చేయాలని ఆ వినతి పత్రంలో కోరారు. ఆ ఇద్దరు మంత్రులు రాజ్యాంగ ధర్మాసనం చేసిన ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆరోపించారు.
కాగా, మిత్రపక్షం డీఎంకేతోపాటు సొంత పార్టీ నేతలు సైతం హిందూ విశ్వాసాన్ని కించపరుస్తుంటే కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం నోరెత్తడం లేదని బీజేపీ మండిపడింది. హిందువులను అవమానించాలని ముంబైలో జరిగిన భేటీలో ‘ఇండియా’ కూటమి నిర్ణయం తీసుకుందా అని బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. 
 
ఇలా ఉండగా, సనాతన ధర్మంపై డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. తమ పార్టీ అన్ని మతాల పట్ల సమాన గౌరవం (సర్వధర్మ సమభావ్‌) చూపుతుందని ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జి పవన్‌ ఖేరా తెలిపారు. ఇండియా కూటమిలోని ప్రతి పార్టీకి అన్ని మతాలు, వర్గాలు, విశ్వాసాల పట్ల ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మౌనాన్ని బీజేపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
 
మరోవంక, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి పలు రాష్ట్రాల్లో తనపై బీజేపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు వచ్చినా తాను భయపడే ప్రసక్తేలేదని మంత్రి ఉదయనిధి మరోమారు స్పష్టం చేశారు. వాటిని చట్ట ప్రకారం ఎదుర్కొనే సత్తా తనకుందని తెలిపారు.
కాగా సనాతన ధర్మం పై ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తక్షణ తన వాఖ్యాలను ఆయన ఉపసంహరించుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి డిమాండ్ చేశారు. అతి పురాతనమైన సనాతన ధర్మంపై ఈ విధంగా వ్యాఖ్యలు చెయ్యటం సమంజసం కాదని ఆమె మండిపడ్డారు. అంతేకాదు టీటీడీ బోర్డు సభ్యుల నియామకం పై కోర్టులో విజయం సాధించామని, తాము వేసిన పిల్ ఆధారంగానే కోర్టు వివరాలు కోరిందని పురందరేశ్వరి తెలిపారు.