2080 నాటికి మూడు రేట్లు పెరిగే భూగర్భ జలాల క్షీణత

2080 నాటికి మూడు రేట్లు పెరిగే భూగర్భ జలాల క్షీణత
భారత్‌లోని భూగర్భ జలాలు మరింత వేగంగా తగ్గిపోయే ప్రమాదమున్నదని మిచిగాన్‌ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని ఒక అధ్యయనం హెచ్చరించింది. భారతీయ రైతులు ప్రస్తుత రేటుతో భూగర్భ జలాలను వినియోగిస్తే భూగర్భజలాల క్షీణత రేటు 2080 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని తెలిపింది. 
ఇది దేశ ఆహారం, నీటి భద్రతతోపాటు జీవనోపాధిపై తీవ్ర ప్రభావాలను కలిగిస్తుందని వివరించింది.
భూగర్భజలాల క్షీణత, వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో తగ్గిన నీటి లభ్యత దేశంలోని ప్రజలలో మూడింట ఒక వంతు మంది జీవనోపాధికి ముప్పు కలిగిస్తుందని వెల్లడైంది. ఈ అధ్యయనం వెల్లడించిన సమాచారం ప్రకారం భారత్‌లో వేడెక్కుతున్న వాతావరణం రైతులను భూగర్భ జలాలను అధికంగా వినియోగించేలా చేసింది. ఈ అధ్యయనాన్ని సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురించారు.
 
”భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు. ప్రాంతీయ, ప్రపంచ ఆహార సరఫరాకు కీలకమైన వనరుగా ఉన్నందున ఇది ఆందోళన కలిగిస్తుంది” అని యూనివర్సిటీ స్కూల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టైనబిలిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సీనియర్‌ రచయిత్రి మేహా జైన్‌ పేర్కొన్నారు. 
 
భారత్‌ అంతటా భూగర్భజలాల నష్టాన్ని అంచనా వేయడానికి భూగర్భజల స్థాయిలు, వాతావరణం, పంట నీటి ఒత్తిడిపై చారిత్రక సమాచారం ఆధారంగా అధ్యయనం విశ్లేషించింది. అధ్యయనంలో భాగంగా చాలా నమూనాలు రాబోయే దశాబ్దాలలో భారత్‌లో పెరిగిన ఉష్ణోగ్రత, పెరిగిన రుతుపవనాల (జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) అవపాతం, శీతాకాలపు అవపాతం తగ్గడం వంటి వాటిని పరిశీలించారు. 
 
వివిధ వాతావరణ మార్పుల పరిస్థితులలో, 2041 నుంచి 2080 మధ్య భూగర్భ జలాల స్థాయి క్షీణత గురించి వారి అంచనాలు సగటున ప్రస్తుత క్షీణత రేటు కంటే మూడు రెట్లు ఎక్కువ అని వారు చెప్పారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత్‌లో ఆహారం, నీటి భద్రతను మరింత సవాలు చేస్తుందనిని భట్టారారు చెప్పారు.