
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లి వైపు వడివడిగా ఒక్కో దశను దాటుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో గురువారం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. అంతరిక్ష నౌక నుంచి ల్యాండర్ ‘విక్రమ్’ విడిపోయింది. ఈ రోజు నుంచి ల్యాండర్ చంద్రుడి చుట్టూ తిరగనుంది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై ల్యాండ్ కానుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఇస్రో వెల్లడించింది.
‘‘ఎల్‌ఎం (ల్యాండర్ మాడ్యూల్) విజయవంతంగా ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) నుంచి వేరుపడింది. రేపు నిర్వహించే డీబూస్టింగ్ తర్వాత.. ల్యాండర్ మాడ్యూల్ మెల్లగా తక్కువ కక్ష్యలోకి వెళ్తుంది” అని ఇస్రో తెలిపింది. శుక్రావారంసాయంత్రం 4 గంటలకు డీబూస్టింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.
చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను బుధవారం విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం 153x 163 కి.మీ కక్ష్యలో స్పేస్‌క్రాఫ్ట్ తిరుగుతున్నది.
ల్యాండర్ మాడ్యూల్ వేరు అయిన అనంతరం అతి కీలకమైన పరిణామం స్పేస్‌క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది. అనంతరం స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 30 కి.మీ దూరం), అపోలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ దూరం) కక్ష్యలోకి ప్రవేశపెడతారు.
అనంతరం అడ్డంగా ఉన్న స్పేస్‌క్రాఫ్ట్‌ను నిలువుగా మార్చే ప్రక్రియను చేపడతారు. ఆ తర్వాత ఇదే కక్ష్య నుంచి ఆగస్టు 23న సాఫ్ట్ ల్యాండింగ్‌ను చేయనున్నారు. చంద్రుడి ఉపరితలంపై దిగిన వెంటనే.. ప్రజ్ఞాన్ రోవర్ ఫొటోను ల్యాండర్ తీస్తుంది. తర్వాత రోవర్ రంగంలోకి దిగి పరిశోధన ప్రారంభిస్తుంది.
ఆగస్టు 1న భూమి-చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్‌క్రాఫ్ట్ ఆగస్టు 5న లూనార్ ఆర్బిట్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా ఆగస్టు 6, 9, 14, 16న కక్ష్య తగ్గింపు ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రయాన్-3 చివరి లూనార్ కక్ష్య తగ్గింపు విజయవంతం అవడంపై ఇస్రో మాజీ చైర్మన్ కె శివన్ సంతోషం వ్యక్తం చేశారు.
చంద్రయాన్-2 ప్రయోగం సమయంలో ఆయన ఇస్రో చైర్మన్‌గా వ్యవహరించారు. ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలాన్ని తాకే గొప్ప క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని శివన్ పేర్కొన్నారు. గతంలో ప్రయోగించిన చంద్రయాన్-2 కూడా ఈ ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తు చేశారు. గతంలో ఎదుర్కొన్న వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. చంద్రయాన్-3 కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ