లంబాడీలపై ఎంపీ బాపూరావు వాఖ్యలు వ్యక్తిగతం

లంబాడీలపై ఎంపీ బాపూరావు వాఖ్యలు వ్యక్తిగతం
తెలంగాణలోని లంబాడీలపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు చేసిన వాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించేందుకు కిషన్ రెడ్డి జనగామ వెళ్లగా బాపూరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని భారత రాజ్యాంగంలో ఉందని తెలిపారు. అయితే రాష్ట్రంలో ఎస్టీలకు రిజర్వేషన్లు రాకుండా తొమ్మిది ఏళ్లుగా వాళ్లకు అన్యాయం చేసిన చరిత్ర కేసీఆర్ సర్కారుదేనని కిషన్ రెడ్డి ఆరోపించారు.
 
 కాగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చారు. వీలైతే ఎన్నికల ముందే పెంచడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పారు.  ఇదిలా ఉంటే గత వారం రోజులుగా రాష్ట్రంలో కురిసిన వర్షాలకు అనేక జిల్లాలో ప్రజలు చాలా నష్టపోయారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
 
పంటలు నాశనమయ్యాయని, పశువులు కొట్టుకుపోయాయని, రోడ్లు కూడా ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను సాయం చేసేందుకు బీజేపీ బృందాలు ఆయా కేంద్రాలలో పర్యటించనున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.

ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో ఏర్పడిన వరద పరిస్థితులను వివరించామని తెలిపారు. త్వరలోనే కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని అమిత్ షా చెప్పినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేంద్ర బృందం తెలంగాణ కు చేరుకుంటుంది. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు.

“సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంటల భీమా పథకం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ భీమా పథకం అమలు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు” అంటూ విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై రైతులు హైకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా రైతులకు న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

వరదల విషయం తెలియగానే కేంద్రమంత్రి అమిత్ షాతో మాట్లాడాగా ఆయన వెంటనే రెండు ఆర్మీ హెలికాప్టర్లను, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారని తెలిపారు. రూ. 900 కోట్లకు పైగా గల ఎస్డీఆర్యేఫ్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించవచ్చని ఆయన తెలిపారు. 

ఎస్డీఆర్ఎఫ్ కింద మృతులకు రూ. 4లక్షల రూపాయలు ఇవ్వొచ్చని కిషన్ రెడ్డి సూచించారు. పట్టణ ప్రాంతాల్లో కాల్వలు కబ్జాలు కావడం, పూడిక తీత పనులు చేయకపోవడం వల్లే వరదలు ముంచెత్తాయని విమర్శించారు.  వరంగల్ నగరంలో ప్రతీయేటా వరదలు వస్తున్నాయని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.