మోదీకి భయం అంటే తెలియదు.. అవినీతిపై చర్యకు వెనుకడుగు లేదు

మోదీకి భయం అంటే తెలియదు.. అవినీతిపై చర్యకు వెనుకడుగు లేదు
అవినీతి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడేది లేదంటూ మోదీకి భయం అంటే తెలియదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరిలో ఈ రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరగబోతున్న ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతూ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఛత్తీస్‌గఢ్ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయబోనని చెప్పారు.
మోదీ శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని నగరం రాయ్‌పూర్‌లో రూ.7,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భయపడేవాడు మోదీయే కాదని చెప్పారు. కాంగ్రెస్ ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ, తాను ఛత్తీస్‌గఢ్ సంక్షేమానికి చర్యలు చేపట్టడంలో వెనుకంజ వేయబోనని చెప్పారు. 

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు తాము పెట్టామని పేర్కొంటూ పేదలకు కాంగ్రెస్ శత్రువు అని,  అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు . ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఆ గాలి వీస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని ఓ పెద్ద పంజా (హస్తం) ఓ గోడలా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. 

ఇది కాంగ్రెస్ పంజా అని, ప్రజల హక్కులను లాక్కుంటోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుని, నాశనం చేయాలని ఈ పంజా సంకల్పించిందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ సమక్షంలోనే మోదీ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. అవినీతి పరులను, అవినీతి ప్రభుత్వాన్ని బీజేపీ వదలదని ప్రధాని హెచ్చరించారు.

అవినీతికి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇస్తే.. అవినీతిపరులపై చర్యలకు బీజేపీ గ్యారెంటీ ఇస్తుందని ప్రధాని తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ప్రజల జీవితాలు మెరుగుపడతాయని మోదీ తెలిపారు. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో సదుపాయాలు, అభివృద్ధి ప్రస్థానం కొత్త పుంతలు తొక్కుతుందని పేర్కొన్నారు. 

రాష్ట్రంలోని అంటాగఢ్-రాయ్‌పూర్ మధ్య నడిచే కొత్త రైలును మోదీ వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులకు కార్డుల పంపిణీని ప్రారంభించారు.

అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కానీ మద్య నిషేధాన్ని అమలు చేయలేదని, వేల కోట్ల రూపాయల అవినీతి మాత్రం చేశారని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ చత్తీస్ గఢ్ కు రావడం ఇదే ప్రథమం.

‘గీతా ప్రెస్’ కేవలం ప్రింటింగ్ ప్రెస్ కాదు

ప్రపంచంలోనే కేవలం ఒక సంస్థగానే కాకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం జీవిస్తున్న ఏకైక ప్రింటింగ్ ప్రెస్ ‘గీతా ప్రెస్’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గీతా ప్రెస్ అనేది ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజలకు దేవాలయమని తెలిపారు. ప్రెస్ పేరులో గీత ఉందని, గీత కోసమే పనిచేస్తోందని అభినందించారు. 

గీతాప్రెస్ శతాబ్ది ఉత్సావాల ముగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటూ గీతా ప్రెస్ నేపాలీ భాషలో అనువదించిన శివపురాణం, మహాశివపురాణం పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.