ఆలయాల ఉత్సవాల్లో వ్యక్తిగత మర్యాదలొద్దు

ఆలయాల ఉత్సవాల్లో వ్యక్తిగత మర్యాదలొద్దు
ఆలయాల ఉత్సవాల్లో వ్యక్తిగత మర్యాదలు వద్దని మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ స్పష్టం చేసింది. శివగంగై జిల్లా సింగంపునరి మలైకోట గ్రామంలో హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఆలయంలో ఆషాఢ మాస వేడుకల్లో వ్యక్తిగత పూజలు వద్దని, అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఈ వేడుకల్లో పాలు పంచుకునేలా అనుమతివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మదురై ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
 
మలైకోట గ్రామంలో శాంతి వీరన్‌స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో యేటా ఆషాఢ మాసంలో 8 రోజుల పాటు వార్షిక వేడుకలగు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ప్రత్యేకంగా ట్రస్టీలను కూడా నియమించారు. ఈ ఆలయ వేడుకల్లో వ్యక్తిగత మర్యాదలు, పూజలను 2020లో దేవాదాయ శాఖ నిషేధించింది.
 
ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా మలైకోట గ్రామానికి చెందిన శశి పాండిదురై, బాలసుందరం, జయబాలన్‌, నవనీతన్‌ మూలవిరాట్టుకు తలపాగా చుట్టుకుని ఛత్రం పట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించగా, కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆ యేడాది జరిగిన వేడుకల్లో ఘర్షణలు తలెత్తాయి.
 
ఈయేడాది జరగనున్న వేడుకల్లో వీరివల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యేందుకు అవకాశాలు లేకపోలేదు. పైగా షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన ప్రజలను ఆలయంలోకి అనుమతించడం లేదు. అందువల్ల ఈ యేడాది జరిగే ఈ ఆలయ వేడుకల్లో వ్యక్తిగత మర్యాదలు, పూజలకు అనుమతించకుండా ఆలయ అధికారులను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు.
 
దీనిపై మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ విజయ్‌కుమార్‌ గంగాపూర్‌వాలా, హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రహ్మణ్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి  ఈ ఆలయ వేడుకల్లో వ్యక్తిగత మర్యాదలు, పూజలు వద్దని స్పష్టం చేసింది.  అలాగే, అన్ని ఆలయ వేడుకలు, ఉత్సవాల్లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొనేలా దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్ని ఆలయాల ఉత్సవాల్లో వ్యక్తిగత మర్యాదలు వద్దని స్పష్టం చేసింది.