టెన్నిస్‌లో అత్య‌ధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన జొకోవిచ్‌

టెన్నిస్‌లో అత్య‌ధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన జొకోవిచ్‌

టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గడం ద్వారా జొకో.. తన గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 23కు పెంచుకున్నాడు. అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ఆట‌గాడిగా రికార్డు సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను మూడోసారి కైవ‌సం చేసుకున్నాడు.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ 7-6 (7/1), 6-3, 7-5తో నార్వే ప్లేయర్ క్యాస్పర్ రూడ్ పై ఘన విజయం సాధించాడు. 3 గంటల 13 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నొవాక్‌ జొకోవిచ్ వరుస సెట్లలో క్యాస్పర్ రూడ్ పై గెలుపొందాడు. తద్వారా పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా నిలిచాడు. 

తొలి సెట్‌లో తీవ్ర ప్రతిఘటన కనబర్చిన 24 ఏండ్ల రూడ్‌.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు. కీలక సమయాల్లో ఒత్తిడికి లోనై ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకున్నాడు. రూడ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కాగా.. మూడింట్లోనూ అతడు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు. ఈ క్రమంలో జొకో.. అతి పెద్ద వయస్సులో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన ప్లేయర్‌గా నిలిచాడు.

రోలాండ్‌ గారోస్‌లో జొకోవిచ్‌కు ఇది మూడో టైటిల్‌. గతంలో 2016, 2021లో ఈ సెర్బియా వీరుడు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను మూడేసి సార్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.గత 20 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో జొకోవిచ్‌కు ఇది 11వ టైటిల్‌.

ఈ మ్యాచ్ ముందు వరకు కూడా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన పురుషుల జాబితాలో స్పెయిన్ బుల్ రాఫెల్ నడాల్ తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్ 2023ని నెగ్గడం ద్వారా 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో జొకోవిచ్ కొత్త చరిత్ర లిఖించాడు. నడాల్ 22 టైటిల్స్ తో రెండో స్థానంలో, ఫెడరర్ 20 టైటిల్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు.