మణిపూర్ విభజనను తోసిపుచ్చిన కేంద్రం

మణిపూర్ విభజనను తోసిపుచ్చిన కేంద్రం
మణిపూర్‌ను జాతి ప్రాతిపదికన విభజించడాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ వెల్లడించారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి భేటీ అయినట్లు చెప్పారు. రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై అమిత్‌ షా విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉనుందుకు సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ (ఎస్‌ఒఒ) ఒప్పందం ప్రకారం ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఎం చెప్పారు. రాష్ట్ర ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడబోమని స్పష్టం చేశారు.
 
ఈ నెల 3 నుంచి కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో గిరిజనేతరులైన మెయిటీలకు, గిరిజనులైన కుకిలకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో 70 మంది మరణించగా, వందలాదిమంది గాయపడ్డారు. సుమారు 1,700 ఇళ్లు ధ్వంసమయ్యాయి.  కుకిలకు ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వచ్చింది.
రాష్ట్రంలో ఉను కుకి-చిన్‌-జోమి ప్రాంతాలను మిజోరంలో విలీనం చేయాలని కూడా కొంతమంది డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, కుకీ తెగ ప్రజలు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయడం కుదరదని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు.  ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని  తెలిపారు.

కుకీ తెగకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇటీవల ప్రత్యేక పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వీరిలో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల డిమాండ్‌ను సీఎం బిరేన్‌ సింగ్‌ తిరస్కరించారు. మణిపూర్‌ ప్రాదేశిక సమగ్రతను కాపాడతామని, ప్రత్యేక పరిపాల న కుదరదని ఆయన పేర్కొన్నారు.ప్రజలెవరూ ఎలాంటి ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు.