
అసెంబ్లీ ఎన్నికల ముందు రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై పలుమార్లు విమర్శలు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత సచిన్ పైలట్ ఇటీవల సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు ఏకంగా గెహ్లాట్ సర్కారుకు ఓ అల్టిమేటం జారీచేశారు.
గత బీజేపీ ప్రభుత్వాల అవినీతిపై 15 రోజుల్లోగా చర్యలు చేపట్టకపోతే తన ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తానని పైలట్ హెచ్చరించారు. గతంలో బీజేపీ పాలనలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల పేపర్ల లీకేజీ తదితర అంశాలపై విచారణకు డిమాండ్ చేస్తూ సచిన్ పైలట్ చేపట్టిన ఐదు రోజుల ‘జన్ సంఘర్ష్ యాత్ర’ సోమవారంతో ముగిసింది.
ఈ సందర్భంగా పైలట్ మాట్లాడుతూ ‘అవినీతికి వ్యతిరేకంగా నేను, సీఎం గెహ్లాట్ పోరాడాం. కానీ ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలి’ అని స్పష్టం చేశారు.
పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని అంటూ 15 రోజుల్లోగా గెహ్లాట్ సర్కారు ఈ డిమాండ్లపై స్పందించాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తానని పైలట్ హెచ్చరించారు. తాను చేపట్టబోయే ఆందోళన మూలంగా తలెత్తే ఎలాంటి పరిణామాలకు భయపడబోనని, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడుతానని సచిన్ పైలట్ తెగేసి చెప్పారు.
మరోవైపు తాను ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదని, అలాగే ఎవరిపట్ల కూడా తనకు శతృత్వం లేదని సచిన్ పైలట్ తెలిపారు. అవినీతిపై సీఎం అశోక్ గెహ్లాట్‌కు తాను ఎన్ని లేఖలు రాసినా ఆయన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 40 శాతం కమీషన్ వంటి అవినీతి ఆరోపణల వల్లనే కర్ణాటక ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించారని గుర్తు చేశారు. అందుకే అవినీతిపై చర్యల కోసం తాను పోరాడుతున్నట్లు వెల్లడించారు.
చాలారోజులుగా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సచిన్ పైలట్ ఒకరోజు నిరాహార దీక్ష చేయగా, అశోక్ గెహ్లాట్ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. దాంతో వారి మధ్య విభేదాలు మిరంత తీవ్రమయ్యాయి.
సీఎం గెహ్లాట్ కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని కాకుండా వసుంధరా రాజేను తన నాయకురాలిగా భావిస్తున్నాడంటూ పైలట్ ఎద్దేవా చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఇంతగా బజారునపడి రచ్చ రచ్చగా మారుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ప్రేక్షకపాత్ర వహిస్తున్నట్లు కనిపిస్తున్నది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు