ప్రతి జిల్లాలో రోజ్ గార్ సృజన్ కేంద్రాలు

ప్రతి జిల్లాలో రోజ్ గార్ సృజన్ కేంద్రాలు
దేశాభివృద్ధిలో ఆర్థిక స్వాతంత్ర్య స్వావలంబన దిశగా ముందుకెళ్లడానికి దేశమంతా రోజ్ గార్ సృజన్ కేంద్రాలను ప్రతి జిల్లాలలో ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నట్లు  స్వావలంభి భారత్ అభియాన్ హైదరాబాద్ లో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కార్యశాలలో తెలిపారు.
 
కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి వైపు మళ్లించేందుకు గాను నూతనంగా వ్యాపార రంగంలో రాణించేందుకు కొత్త ఒరవడులు సృష్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. అందుకుగాను ప్రత్యేకంగా అనేక కార్యక్రమాల ద్వారా శిక్షణా కార్యక్రమాలు, అవగాహనా కార్యక్రమాలు, కార్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
 
 అనేకానేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వ్యవస్థాపకుల చేత మరింత జ్ఞాన సముపార్జనను అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ నడింపల్లి, స్వావలంభి భారత్ అభియాన్ దక్షిణ మధ్య భారత్ క్షేత్ర  సమన్వయక్ డా.సత్తు లింగమూర్తి, భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి కుమార స్వామీ, స్వావలంభి భారత్ అభియాన్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ ముక్కా హరీష్ బాబు, కో కన్వీనర్ గోటూరి రమేష్ గౌడ్, తెలంగాణ ప్రాంత స్వదేశీ జాగరణ మంచ్ సంఘటనా మంత్రి రచ్చ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
 
అంశాల వారీగా నిర్వహించుకున్న సమావేశాలలో సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్ రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ అబ్దుల్ రేహిమాన్,ఐ. ఈ.డి.సి అధికారి కె.శివరామ ప్రసాద్, ఆర్ డి పి వర్క్ స్టేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు విక్రమ్ రెడ్లపల్లి, సామాజిక ఉద్యోగ ఉత్పత్తి రంగ నిపుణులు కొత్త కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
చిన్నతరహా పరిశ్రమల రంగాలలో, పర్యాటక శాఖ అభివృద్ధిలో ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసుకున్న సంస్థలలో ఉపాధి రంగం, ఆర్గానిక్ ఉత్పత్తుల్లో వ్యాపార అభివృద్ధిలో మెలకువలు, సహకార సంఘాల నిర్వహణలో పాటించాల్సిన పద్ధతులు, బ్యాంకింగ్ రంగం ద్వారా నూతనంగా ఏర్పాటు చేసుకునే వ్యాపారులకు లోన్లు, సబ్సిడీలు అందించే కార్యపద్దతిని గురించి వారు వివరించారు.

ఈ కార్యక్రమానికి 25 జిల్లాల నుండి 200 మంది పాల్గొన్నారని, ఆర్థికంగా భారత్ అభివృద్ధి పథంలో వెళ్ళడానికి, ఆర్థిక స్వావలంభన కొరకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకోవడంతో బాటు నేర్చుకొనే ప్రయత్నం చేశారని తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కేశవ సోని తెలిపారు.  ఉపాధి అవగాహన కల్పనా కేంద్రాలను తెలంగాణ రాష్ట్రమంతా ప్రతి జిల్లాలలో నెలకొల్పే విధంగా, ఉపాధి మార్గాలను అన్వేషించే విధంగా రూపకల్పనలు చేసుకున్నట్లు వివరించారు.