
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న బీహార్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌సింగ్ జైలు నుంచి విడుదల కాబోవడం దుమారం రేపుతోంది. బీహార్ ప్రభుత్వం ఇటీవల మార్చిన జైలు నిబంధనలతో ఆయన బయటపడనున్నారు.
ఆనంద్ మోహన్ విడుదల నేరస్థులను ప్రోత్సహించడమేనని, దీనిపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కృష్ణయ్య సతీమణి ఉమా కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆనంద్ మోహన్ కోసమే నితీశ్ ప్రభుత్వం జైలు నిబంధనలు మార్చిందని బీజేపీ, బీఎస్పీ ఆరోపిస్తున్నాయి.
ఆనంద్ మోహన్‌సింగ్ గత 15 ఏండ్లుగా జైలులోనే ఉన్నారు. బీహార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న జైలు మాన్యువల్-2012ను మార్చింది. ప్రభుత్వ ఉద్యోగుల హత్య కేసుల్లో శిక్ష పడిన వారిని సత్ప్రవర్తన కింద విడుదల చేయొద్దని చెబుతున్న 481వ నిబంధనను తీసేసింది. దీంతో ఆనంద్ మోహన్‌సింగ్ సహా 26 మంది జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది.
ముజఫర్‌పూర్‌లో జరిగిన ఛోటన్ శుక్లా అంత్యక్రియల సందర్భంగా 1994లో 35 ఏళ్ల ఐఏఎస్ అధికారి జి. క్రిష్ణయ్యను కారులో నుంచి బయటకు లాగి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో జి. కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆందోళనకారుల్ని రెచ్చగొట్టి ఐఏఎస్ అధికారి కృష్ణయ్య మృతికి కారణమైన ఆనంద్ మోహన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదే కేసులో దోషిగా తేలిన ఆనంద్ మోహన్ కు ఉరిశిక్ష పడింది. జైల్లో ఉన్న సమయంలో ఎంపీగా పోటీ చేసి.. ఎన్నికల్లో విజయం సాధించారు. ఎంపీగా ఉన్న వేళలోనే అతనికి ఉరిశిక్ష విధించటంతో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత అతనికి పడిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు
కాగా, ఇప్పుడు ఆనంద్ మోహన్ కొడుకు , ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి పెరోల్ మీద ఆనంద్ మోహన్ రాగా, సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా వచ్చారు. ఆర్జేడీ ఎమ్మెల్యే పెళ్లికి నిబంధనలు మార్చి.. సీఎం నితీశ్ గిఫ్టు ఇచ్చారా? అనే సందేహం స్థానికంగా వ్యక్తమవుతోంది.
ఆనంద్ మోహన్ విడుదల నిర్ణయాన్ని దివంగత దళిత ఐఏఎస్ కృష్ణయ్య సతీమణి ఉమా కృష్ణయ్య తప్పుపట్టారు. ఈ నిర్ణయం సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతుందని, నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని బీహార్ సీఎంకు చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్