రష్యాతో యుద్ధం వేళ భారత్ కు వస్తున్న ఉక్రెయిన్ మహిళా మంత్రి

రష్యాతో యుద్ధం వేళ భారత్ కు వస్తున్న ఉక్రెయిన్ మహిళా మంత్రి

సంవత్సరంకు పైగా రష్యా భీకరమైన యుద్ధం చేస్తూ, భారీ విధ్వంసం సృష్టిస్తున్న ఉక్రెయిన్ నుండి ఆ దేశ విదేశాంగ డిప్యూటీ మంత్రి ఎమైన్ జాపరోవా భారత్‌లో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.  గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రారంభించిన తరువాత నుంచి ఉక్రెయిన్ ప్రతినిధులు న్యూఢిల్లీకి అధికారిక పర్యటనకు రావడం ఇదే తొలిసారి.

జాపరోవా పర్యటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు, ఉక్రెయిన్ అంశం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు తదితర విషయాలపై చర్చలు జరపనున్నట్టుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

‘‘ఉక్రెయిన్ తో భారత్ కు ద్వౌపాక్షిక,స్నేహపూర్వక బంధాలు ఉన్నాయి. 30 ఏళ్ల ఈ మైత్రిలో విద్యా, వాణిజ్యం, సాంస్కృతి మరియు రక్షణ రంగాలలో ఇరు దేశాలు సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి’’ అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఆమె దేశంలో పర్యటిస్తారని పేర్కొంది.

అందులో భాగంగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి (పశ్చిమ దేశాలకు) సంజయ్ వర్మతో జాపరోవా సమావేశం కానున్నట్లు తెలిపింది. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్‌లో, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులపై వీరిద్దరూ చర్చలు జరపనున్నారు.  విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీతోనే ఉక్రెయిన్ మంత్రి భేటీ కానున్నారు. అంతేగాక, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆమె ఉక్రెయిన్ పర్యటనకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర విషయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. అయితే దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం భారత్ జీ 20 సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో జీ20 దేశాధినేతల సమావేశం జరగనుంది. ఆ సదస్సులో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మంత్రి భారత పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.