దేశవ్యాప్తంగా వినియోగదారులకు శనివారం నుంచి గొప్ప ఉపశమనం కలుగుతుంది. నేచురల్ గ్యాస్ ధరలను నిర్ణయించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం సవరించడంతో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (పి ఎన్ జి), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సి ఎన్ జి) ధరలు సుమారు 11 శాతం వరకు తగ్గబోతున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు ఈ వివరాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నూతన విధానం వల్ల ఇళ్లలోని వంట గదులకు సరఫరా చేసే పైప్‌డ్ నేచురల్ గ్యాస్, ఆటోమొబైల్స్‌కు సరఫరా చేసే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు శనివారం నుంచి 11 శాతం వరకు తగ్గుతాయి. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంనాడు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా పీఎన్‌జీ, సీఎన్‌జీలను ఉపయోగించేవారికి దీనివల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంనాడు ప్రజలకు మోదీ ఈ బహుమతిని ప్రకటించారని చెప్పారు. ఇది శుభదినం, మంచి నిర్ణయం అని పేర్కొన్నారు. దీనివల్ల గృహ వినియోగదారులకు, అదేవిధంగా పారిశ్రామిక రంగానికి, రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ధరలు తగ్గే విధానాన్ని వివరిస్తూ, పుణేలో కేజీ సీఎన్‌జీ రూ.92 ఉంటే, నూతన విధానం ప్రకారం అది రూ.87 అవుతుందన్నారు. పీఎన్‌జీ ధర రూ.57 ఉంటే, అది రూ.52కు తగ్గుతుందని వివరించారు.
ఈ మేరకు గ్యాస్ ధరల మార్గదర్శకాలకు సవరణలు ఆమోదించారు. అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలు భారతీయ క్రూడ్ మార్కెట్తో అనుసంధానం కానున్నాయి. సహజ వాయువు ధర భారతీయ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో పది శాతం ఉంచాలని నిర్ణయించింది. స్థిరమైన ధరను నిర్ధారించడానికి కొత్త విధానాన్ని అమలు చేయనుంది.
దీంతో నెలవారీగా గ్యాస్ రేట్ల నిర్ణయించనున్నారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు, ఉత్పత్తిదారులకు ఉపశమనం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
More Stories
షట్‌డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు