భారీగా పెరుగుతున్న కరోనా పట్ల డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

భారీగా పెరుగుతున్న కరోనా పట్ల డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, దాదాపు ఆరు నెలల తర్వాత మరోసారి మరోసారి రోజు రోజుకు 3వేల మందికి వైరస్‌ సోకుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ XBB.1.16 రూపాంతరమే కారణమని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే పలు అధ్యయనాలు వేరియంట్‌ ఇన్ఫెక్టివిటీ రేటును చూపుతున్నాయని పేర్కొంటున్నాయి. గత నెల రోజుల గణాంకాలను పరిశీలిస్తే కొవిడ్‌ కేసులతో పాటు మరణాలు సైతం పెరిగాయి. దీంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి  డబ్ల్యూహెచ్‌ఓ  విడుదల చేసిన ఎపిడెమియోలాజికల్ నివేదిక ప్రకారం గత 28 రోజుల్లో భారతదేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 114 శాతానికిపైగా పెరిగింది. అదే సమయంలో కరోనా కేసుల సంఖ్య 437 శాతం పెరిగింది. కేసుల పెరుగుదలకు, మరణాలకు ఇంకా కారణాలు తెలియరాలేదు.

ఆగ్నేయాసియా ప్రాంతం నుంచి 27వేల కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్‌ తర్వాత మాల్దీవుల్లో 129శాతం, నేపాల్‌లో 89శాతం కేసులు పెరిగాయి. ఈ క్రమంలో కరోనాపై మరోసారి అన్ని దేశాలు సీరియస్‌గా దృష్టి సారించాలని, కొత్త సవాళ్లను ఎదురుకాబోతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 22 దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ XBB.1.16కి చెందిన 800 సీక్వెన్స్‌లు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ COVID-19 సాంకేతిక విభాగం అధిపతి డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. చాలా సీక్వెన్స్‌లు భారత్‌ నుంచే వచ్చాయన్నారు. XBB.1.16 ప్రొఫైలింగ్ వాస్తవానికి XBB.1.5ని పోలి ఉంటుంది.

స్పైక్ ప్రోటీన్‌లో అదనపు మ్యుటేషన్ కలిగి ఉంది. ల్యాబ్‌లో నిర్వహించిన అధ్యయనాల్లో ఈ వేరియంట్‌ ఇన్ఫెక్షన్‌ను పెంచుతున్నట్లు తేలింది. కొన్ని నెలల నుంచి చాలా దేశాల్లో పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ XBB.1.16ని నిత్యం పర్యవేక్షిస్తున్నది. ఈ సందర్భంగా గ్రేటర్‌ నోయిడాకు చెందిన కరోనా కేర్‌ నిపుణు శ్రేయ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ సాధారణంగా ఓమిక్రాన్ వేరియంట్‌, అన్ని సబ్-వేరియంట్లు అధిక ఇన్ఫెక్టివిటీ రేటును ఉంటాయని తెలిపారు.

కానీ, తీవ్రమైన మరణానికి ముప్పు ఒకేలా ఉండదని చెప్పారు. లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయని పేర్కొంటూ XBB.1.16 తీవ్రమైంది కాదని స్పష్టం చేశారు. వేరియంట్‌తో కొమొర్బిడిటీ, బలహీనమైన రోగనిరోధక శక్తి, టీకాలు తీసుకోని వారికి ఎక్కువగా ప్రమాదం ఉంటుందని వివరించారు. టీకాలు వేసిన వ్యక్తులు ఇన్ఫెక్షన్ బారినపడ్డా తీవ్రమైన ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పారు. వైరస్‌ను నివారించేందుకు ప్రజలంతా తప్పనిసరిగా కొవిడ్‌ నియమాలను పాటించడం కొనసాగించాలని, ఇదే వైరస్‌ వేగాన్ని తగ్గించడానికి ఏకైక మార్గమని వివరించారు.