ఈడీ విచారణకు శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న మాగుంట రాఘవ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ కోర్టు మరో 10 రోజులు పొడిగించింది. శనివారం నాటికి జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో సీబీఐ అధికారులు రాఘవను మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు.

ఈ మేరకు మార్చి 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.కే. నాగ్‌పాల్ ఉత్తర్వులిచ్చారు. మరోవైపు మద్యం పాలసీ కేసులో చోటుచేసుకున్న మనీలాండింగ్ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సమన్లు జారీ చేసి శనివారం హాజరుకావాల్సిందిగా ఆదేశించినప్పటికీ ఆయన హాజరుకాలేదు.

శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆయన హుటాహుటిన శుక్రవారం రాత్రి చెన్నై బయల్దేరి వెళ్లినట్టు తెలిసింది. అతడిని పరామర్శించడానికి చెన్నై వెళ్తున్నానని, అందువల్ల ఈ రోజు విచారణకు హాజరు కాలేనని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీకి తన న్యాయవాది ద్వారా సమాచారం పంపించారు. దాంతో మరో సారి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ సమన్లు జారీ చేయనుంది.

తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో కన్‌ఫ్రంటేషన్ విధానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావించారు.ఇదే విషయాన్ని స్పెషల్ కోర్టుకు చెప్పి పిళ్ళై కస్టడీ పొడిగించాలని కోరారు.

ఆ మేరకు శుక్రవారం బుచ్చిబాబు, శనివారం మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సోమవారం కల్వకుంట్ల కవితతో కన్‌ఫ్రంటేషన్ విధానంలో పిళ్ళైని ప్రశ్నించడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం అనుకున్నట్టుగానే కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుతో పిళ్ళైకి కన్‌ఫ్రంటేషన్ జరిగింది. కానీ శనివారం మాగుంట హాజరుకాకపోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్వయంగా ఈ సౌత్ గ్రూప్ తో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో లావాదేవీల గురించి వివరించాడని, ఈ మొత్తం వ్యవహారాన్ని తన కుమారుడు రాఘవ చూసుకుంటాడని హామీ ఇచ్చాడని ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో స్వయంగా సమావేశమై, ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో అడుగుపెట్టనున్నట్లు చెప్పానని, దాన్ని ఆయన స్వాగతించారని, ఢిల్లీ ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలా సహాయం అందుతుందని ఆ సౌత్ గ్రూప్ సభ్యులకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హామీ ఇచ్చారని ఈడీ పేర్కొంది.