పాలనా వ్యవహారాలలో జోక్యంతో న్యాయమూర్తులపై విమర్శలు

పాలనాపరమైన వ్యవహారాల్లో న్యాయమూర్తులు జోక్యం వల్ల వారిపై విమర్శలు వస్తాయని, కేసుల విచారణ సమయంలో న్యాయ సూత్రాల విషయంలో రాజీ పడాల్సి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు హెచ్చరించారు. ‘ఇండియా టుడే ’ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నియామక ప్రక్రియలో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటే మరి న్యాయవ్యవస్థను పట్టించుకునేది ఎవరు ? అని ప్రశ్నించారు.
 
కార్యనిర్వాహక , న్యాయవ్యవస్థలు ఏమీ చేయాలన్న దానిపై రాజ్యాంగ ‘లక్ష్మణరేఖ స్పష్టంగా ’ పేర్కొందని కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ముఖ్యఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక విషయంలో ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.
 
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ “ఎన్నికల కమిషనర్ల నియామకం గురించి రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. దీనిపై పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగా నియామకాలు జరగాల్సి ఉంది. అయితే పార్లమెంట్ అలాంటి చట్టం చేయలేదు. ఆ విషయంలో శూన్యత ఉందని అంగీకరిస్తున్నా” అని చెప్పారు.
 
ఇక్కడ సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదని స్పష్టం చేస్తూ కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు దేశంలోని కీలక నియామకాల విషయంలో జోక్యం చేసుకుంటుంటే …న్యాయ వ్యవహారాలు ఎవరు చూస్తారు? అని ప్రశ్నించారు. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి పాలనా పరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయని తెలిపారు.
 
రేప్పొద్దున్న అదే వ్యవహారం కోర్టుకు చేరినప్పుడు ఆ నియామకంలో భాగస్థులైన న్యాయమూర్తులు తీర్పులు ఎలా వెలువరిస్తారు? ఇది న్యాయసూత్రాల విషయంలో రాజీ పడడం కాదా? అని రిజిజు సందేహం వ్యక్తం చేశారు.  న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం పేర్లు పంపితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, లేకుంటే ప్రభుత్వం పోస్టుమాస్టర్‌గా కూర్చోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. జడ్జీలుగా నియామకానికి సంబంధించి పేర్లను కొలీజియం తిరిగి పంపడంపై, ఆయా పేర్లపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలకు ఉన్న కారణాలను బహిరంగ పరచాలన్న కొలీజియం నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు.
 
‘నా వద్ద ఇప్పుడు కొందరి పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరిపై సహచర జడ్జీలు, ప్రజలు, బార్‌ అసోసియేషన్‌ నుంచి చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఆ పేర్లను బయటపెట్టదలచుకోలేదు. ఒక న్యాయమూర్తి, మరొక న్యాయమూర్తిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే.. వాటిని నేను బహిరంగపరచకూడదు’ అని పేర్కొన్నారు.
 
భారత న్యాయవ్యవస్థ హైజాగ్‌కు గురవుతున్నదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాహుల్‌ గాంధీ లేదా ఏ ఇతరులు చెప్పినా.. అది దేశ న్యాయవ్యవస్థను అణచివేసే ప్రయత్నంలో భాగమేనని రిజిజు స్పష్టం చేశారు.  కాగా, స్వలింగ వివాహాల విషయాన్నీ సుప్రీం కోర్టు నిర్ణయానికి వదిలివేయాలా? లేదా పార్లమెంట్ కు వదిలివేయాలి? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ దేశ ప్రజల విజ్ఞతకు వదిలివేయడం మంచిదని కేంద్ర మంత్రి సూచించారు.