టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సీఎం ఆఫీస్

కేసీఆర్ పాలనలో ఉద్యోగ నియామకాల్లోనే పెద్ద కుట్ర కన్పిస్తోందని పేర్కొంటూ ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సీఎం ఆఫీస్ నుండే జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సీఎంఓలో పదవీ విరమణ పొందిన ప్రధాన అధికారి పాత్ర ఈ పేపర్ లీకేజీలో ఉందని ఆయన ఆరోపించారు. సింగరేణి ప్రశ్నాపత్రాల నియామకాల్లోనూ ఆ అధికారి పాత్ర ఉందని తెలిపారు.
 
సదరు అధికారి టీఎస్పీఎస్సీలో ముగ్గురు వ్యక్తులను నియమించే సమయంలోనూ ఆయన పాత్రే ఉందని చెబుతూ  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో పెద్ద గూడుపుఠాణి ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ చేసిన పోలీస్ అథికారి రెక్కి చేసి నిందితులను దొరకపట్టిన తరువాత కూడా  బయట ఎక్కడ ఈ విషయం చెప్పినా నీ సంగతి చూస్తామని ఒక అమ్మాయిని బెదిరించాడని సంజయ్ ఆరోపించారు.
 
కచ్చితంగా సీఎంఓలో పనిచేసే అధికారి హస్తం ఉందని చెబుతూదీనిని మాయమార్చేందుకే ఇదంతా చేస్తున్నారని అంటూ ఇందులో సీఎంకు ఏటీఎంలా మారిన వాళ్లందరి పాత్ర బయట పడుతోందని స్పష్టం చేశారు. ఆశ్చర్యేమేమిటంటే..చేయించింది మీరే.. తప్పించుకునేది మీరే… అంటూ విమర్శించారు. ‘‘టీఎస్సీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం కన్పిస్తోంది. ఆయన కొడుకు నిర్లక్ష్యంవల్లే తప్పిదం జరిగింది. వెంటనే ఆయన కొడుకును బర్తరఫ్ చేయాలి. బీఆర్ఎస్ లో ఇతరులు తప్పు చేస్తే గెంటేస్తారే… మరి కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేస్తే చర్యల్లేవవా? ’’అంటూ సంజయ్ ప్రశ్నించారు.
 
దీనిపై పక్కా విచారణ జరపాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలే అని, సీఎం కొడుకు పాత్రపైనా ఎంక్వైరీ జరపాలే అని సంజయ్ డిమాండ్ చేశారు.   టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీవల్ల నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. లేనిపక్షంలో మిలియన్ మార్చ్ తరహాలో అతి త్వరలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు.
కాగా, టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో బిజెపి హస్తముందంటూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ‘పేపర్ లీకేజీలో బిజెపి హస్తముంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అధికారంలో ఉన్నది మీరే కదా?” అంటూ ప్రశ్నించారు. పేపర్ లీకేజీలో ఐటి శాఖ తప్పిదాలున్నాయని స్పష్టం చేస్తూ అందుకే కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని అడుగుతున్నామని తెలిపారు. మీరు నిజంగా తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించరని నిలదీశారు.