గన్‌పార్క్ వద్ద బిజెపి మెరుపు ధర్నా… బండి, ఈటెల అరెస్టు

అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సారధ్యంలో బిజెపి కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‎ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరవడంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తతమైన వాతావరణం నెలకొంది.

ఇదే క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగా, ధర్నాకు అనుమతి లేకపోవడంతో ఒంటి గంట వరకు గన్ పార్క్ ను విడిచి వెళ్ళాలంటూ పోలీసులు ఆదేశించారు. శాంతియుత దీక్ష చేస్తోన్న తమను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయనిసంజయ్ హెచ్చరించారు. ట్రాఫిక్ జాంతో ప్రజలు ఇబ్బంది పడ్తున్నారని , పరిస్థితిని అర్థం చేసుకోవాలని పోలీసులు కోరారు.

‘‘టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి వెళ్తాం.. దమ్ముంటే ఆపండి’’ అంటూ పోలీసులకు సంజయ్ సవాల్ విసిరారు. గన్ పార్కు నుంచి ర్యాలీగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి బయలుదేరిన  సంజయ్, బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.  సంజయ్‌తో పాటు ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంజయ్‌ను తరలిస్తున్న వాహనాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు, నిరుద్యోగులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది.

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సంజయ్ ఆరోపించారు. తిండి లేక.. తిప్పలు లేకుండా రాత్రి పగలు చదువుకుని పరీక్షలు రాస్తే అలాంటి పిల్లల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. కష్టపడి చదివిన నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మంత్రి వర్గం తప్పు చేయలేదనుకుంటే  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు