గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి తెలిపారు.

 ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని కూడా రద్దు చేసింది. గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ ను  పేపర్ లీక్ అయిన వ్యవహారం కారణంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవాళ ప్రత్యేకంగా టీఎస్‌పీఎస్‌సి సమావేశమై సిట్ నివేదికను పరిశీలించింది. సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. సిట్ దర్యాప్తులో సాక్ష్యాధారాలు రుజువైన కారణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తిరిగి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను జూన్ 11న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

2022, అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఆ ఫలితాలను 2023,  జ‌న‌వ‌రి 13వ తేదీ విడుద‌ల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. 503 గ్రూప్‌-1 పోస్టులకు 3 లక్షల 80 వేల 81 మంది దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 85 వేల 916 మంది పరీక్షకు హాజరయ్యారు.  పరీక్ష రాసిన వారిలో  25 వేల 50 మంది అభ్యర్థులు మెయిన్స్ కు సెలక్ట్ అయ్యారు. జూన్‌లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈలోపే లీకేజీ వెలుగు చూడటంతో జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

కాగా, టీఎస్‌పీఎస్సీ నుంచి ఐదు పేపర్లు లీక్ అయ్యాయని సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందా లేదా అనే విషయం దర్యాప్తు తర్వాత చెప్తామని చెప్పారు. కంప్యూటర్ లాన్‌లోకి వెళ్లి పేపర్లను తమ పెన్ డ్రైవ్‌లోకి తీసుకున్నారని, రాజకీయ నాయకుల ఫోటోలు దొరికాయని పేర్కొంటూ వారి పాత్ర ఉందా లేదా అనేది విచారణ చేయాలని వివరించారు.

ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్ రెడ్డి పాత్ర కీలకమని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కలిసి లక్ష్మీని ట్రాప్ చేశారని, లక్ష్మీ దగ్గర పాస్‌వర్డ్, ఐడీలను దొంగలించి మొత్తం ఐదు పేపర్లను కాపీ చేసుకున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఏయే పేపర్లు లీక్‌ అయ్యాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఏఈ పరీక్ష పేపర్‌ను రేణుకకు ప్రవీణ్‌ అమ్మాడని,  ప్రవీణ్‌ రాసిన పరీక్షలో అధిక మార్కులు రావడంపై దర్యాపు చేస్తున్నామని తెలిపారు. ప్రవీణ్‌ ఎవరెవరికి పేపర్‌ ఇచ్చారన్నదానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, మరికొందరి ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వర్లు వెల్లడించారు.