ఆరు రాష్ట్రాలలో పెరుగుతున్న కరోనా.. కేంద్రం అప్రమత్తం

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం గురువారం అప్రమత్తం చేసింది. ఈ మేరకు వైరస్‌ నివారణకు చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక ఉన్నాయి.
 
మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కరోనా ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. టెస్ట్-ట్రాక్, ట్రీట్-వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అనుసరించాలని కోరింది.
 
ఇదిలా ఉండగా, నాలుగు నెలల తర్వాత భారత్‌లో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులునమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి. గతేడాది నవంబర్‌లో 734 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసులు ఆ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి.
 
 కరోనా మహమ్మారితో కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్​ కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది.  వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి చేరింది. దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
 

మరోవంక, భారత్‌లో హెచ్3ఎన్2 వ్యాధి మెల్లిగా అదుపుతప్పుతోంది. ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తిని నిరోధించడానికి, తగు చర్యలు తీసుకోడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు 74 ఏళ్ల వ్యక్తి. అతడు హెచ్3ఎన్2 సబ్‌టైప్ కారణంగా చనిపోయాడు. కాగా 23 ఏళ్ల ఎంబిబిఎస్ విద్యార్థి ఒకరు కరోనా, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా చనిపోయాడు. అనుమానిత రోగులకు వెంటనే చికిత్స అందించాలని నిర్ణయించారు.