వేగవంతమైన పారిశ్రామిక ప్రగతికి కట్టుబడి ఉన్నాం 

రాష్ట్రంలో వేగవంతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగింగిస్తూ ఎంఎస్‌ఎంఇ రంగంలో 13.63 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రూ.19,115 కోట్లతో 1.52 లక్షల యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
పెట్టుబడుల కేంద్రంగా విశాఖ మారుతోందని చెబుతూ ఇటీవల నిర్వహించిన సమ్మిట్లో రూ. 13.42 లక్షల కోట్ల విలువైన 378 ఒప్పందాలు జరిగాయని చెప్పారు. 16 కీలక రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొంటూ ఇంధన రంగంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
 
ఎగుమతుల్లో 16.08 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు ఎగుమతులు పెంచి ఏడోర్యాంకు నుండి నాలుగో ర్యాంకుకు చేరుకున్నామని తెలిపారు. ఆగేయాసియాకు గేట్‌వేగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. చెన్నై పారిశ్రామిక కారిడార్లలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, వ్యవసాయ రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
 
  సమ్మిళిత, సుస్ధిర వృద్ధితో రాష్ట్రాన్ని శక్తివంతంగా, పటిష్టంగా తయారు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెబుతూ నేరాల రేటు, హింసను తగ్గించడంలో రాష్ట్రం ముందుందని వివరించారు. వ్యవసాయ రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యారంగంలో ఆధునిక సంస్కరణలు చేపడుతున్నామని, నూతన విద్యావిధానానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తున్నామని పేర్కొన్నారు. నవరత్నాల పేరుతో 30.65 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు.
గవర్నర్‌ ప్రసంగానికి పలుసార్లు సవరణలు చేసినట్లు తెలిసింది. శాసనసభలో చదివిన ప్రసంగ పాఠంలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు. అయితే. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పూర్తి ప్రసంగపాఠంలో ఈ విషయం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై గవర్నర్‌ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేయడం, న్యాయపరమైన అంశాలున్నాయని చెబుతూ తొలగించాలని కోరినట్లు సమాచారం. దీంతో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ పాఠానికి సవరణలు చేశారని, ఫలితంగా మూడు రాజధాను అంశం ప్రసంగ పాఠం నుండి పూర్తిగా మాయమైందని చెబుతున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎనిమిది రోజులపాటు జరగనున్నాయి. గవర్నరు ప్రసంగం అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో 15 కీలక బిల్లులను ఆమోదించనున్నట్లు ప్రభుత్వం తెలిసింది. మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో 54 అంశాలపై చర్చించారు. వీటిల్లో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్త పట్టణాభివృద్ధి శాఖ, దేవాదాయశాఖకు సంబంధించిన అంశాలు వచ్చాయి.