సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ మూసివేతతో లక్ష ఉద్యోగాలకు ముప్పు

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) మూసివేత పట్ల స్టార్టప్‌ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ బ్యాంక్‌ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్‌లపై పడుతుందని, లక్ష ఉద్యోగులు లేఆఫ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని వై కాంబినేటర్‌ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ భారత్‌లోని 200 స్టార్టప్‌లతో పాటు అమెరికాలో వేలాది స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ వై కాంబినేటర్‌ సంస్థ సీఈవో, ప్రెసిడెంట్‌ గార్రీ టాన్‌ అమెరికా ట్రెజరీ కార్యదర్శి జనెట్‌ యెల్లెన్‌, ఇతర ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

ఈ లేఖపై 56 వేల ఉద్యోగులు కలిగిన 1,200 సంస్థల సీఈవోలు సైతం సంతకాలు చేశారు. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌లో దాదాపు 37 వేల చిన్న వ్యాపార సంస్థలకు ఖాతాలు ఉన్నాయని, రెండున్నర లక్షల డాలర్ల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ డబ్బులు వ్యాపారులకు అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

కాగా, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్వీబీ) దివాళా తీయడంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్వీబీ దివాళా తీయడంతో టెక్నాలజీ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. ఎస్వీబీ దివాళా తీయడం అమెరికా బ్యాంకింగ్‌ చరిత్రలోనే రెండో అతిపెద్ద బ్యాంకింగ్‌ వైఫల్యం అని పేర్కొన్నారు.

 
‘అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌.. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్వీబీ) పతనాన్ని చాలా సన్నిహితంగా పరిశీలిస్తున్నాను. ఇది హై-టెక్‌ వరల్డ్‌లోనే అతిపెద్ద సంక్షోభానికి దారి తీసింది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఎస్వీబీ దివాళా వల్ల ఇజ్రాయెల్‌ టెక్‌ పరిశ్రమపై ప్రభావం పడుతుందా? అన్న కోణంలో తమ దేశంలోని సీనియర్‌ టెక్నాలజీ నిపుణులతో సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
‘అవసరమైతే ఇజ్రాయెల్‌ హై-టెక్‌ కంపెనీలు, వాటిల్లో పని చేస్తున్న ఉద్యోగుల రక్షణకు బాధ్యతలు తీసుకుంటాం. ఈ సంక్షోభం వల్ల నిధుల కొరత సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్‌ చేశారు. ఇజ్రాయెల్‌ ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైందని, శక్తిమంతమైందని, ఈ సంక్షోభానికి తగిన పరిష్కారం కనుగొంటుందని నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎస్వీబీతో బ్యాంకింగ్‌ లావాదేవీలు జరుపుతున్న ఇజ్రాయెలీ టెక్‌ సంస్థలకు ద్రవ్య లభ్యత అంటే నగదు లభ్యత సమస్య తలెత్తకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎస్వీబీ పతనం ప్రభావం ఆ సంస్థ శాఖలు గల అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లోని టెక్‌ పరిశ్రమపై పడింది.