చిన్న పొరపాట్లతో కూలిపోయిన అమెరికాలో 15వ పెద్ద బ్యాంకు

ఉదంతమే నిదర్శనం. ఆర్థిక క్రమశిక్షణ లేమి, పెట్టుబడుల్లో దీర్ఘదృష్టి కొరవడడం, రుణాలివ్వడంలో తొందరపాటు, డిపాజిట్‌దారులను కాపాడుకోవడంలో వైఫల్యాలు కారణంగా  40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం గల అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్‌వీబీ) కూలిపోయింది. నాలుగు నెలల క్రితమే ఫోర్బ్ అమెరికాలోని అత్యుత్తమ బ్యాంకుల జాబితాలో చోటుచేసుకున్న ఈ బ్యాంకు ఇంతలో కూలిపోయింది.
 
ఈ బ్యాంక్‌ను మూసివేస్తూ.. పూర్తిగా తమ ఆధినంలోకి తీసుకున్నామని శుక్రవారం అమెరికా రెగ్యూలేటరీ ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డిఐసి) ప్రకటన చేసింది. ఆ బ్యాంక్‌కు సంబంధించిన ఆస్తుల్ని సీజ్‌ చేసింది. కాలిఫోర్నియాలోని శాంతాక్లారా కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌వీబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థగా 1983లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్‌వీబీ) ఏర్పాటైంది. స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ కేంద్రాలకు హబ్‌గా ఉన్న సిలికాన్ వ్యాలీలో టెక్ సంస్థలు, స్టార్టప్‌లు వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు రుణాలిస్తూ ఓ వెలుగు వెలిగింది.
 
అమెరికాలోనే 15వ అతిపెద్ద బ్యాంకుగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఎస్‌వీబీ చేసిన చిన్నచిన్న పొరపాట్లకు టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు వంటి కారణాలతో క్రమంగా దివాలా అంచులకు చేరుకుని, కనుమరుగైపోయింది. బ్యాంకును గడిచిన ఆరేడేళ్లుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
 
ఈ బ్యాంకు దివాళా అంచున ఉండడంతో తమ పెట్టుబడులకై ఈ బ్యాంకుపై ఆధారపడుతున్న మన దేశంలోని స్టార్ట్ అప్ లు ఆందోళన చెందుతున్నారు.  అమెరికాలో ఫెడ్ రుణాల రేట్లను పెంచడంతో ఎస్‌వీబీ పతనం ప్రారంభమైంది. ఈ బ్యాంకు ఫిక్డ్స్ రేట్ అవైలబుల్ ఫర్ సేల్(FRAS) బాండ్ల రూపంలో 21 బిలియన్ డాలర్లను దీర్ఘకాలిక (మూడున్నర సంవత్సరాలకు) 1.79% వడ్డీ రేటుపై ఇన్వెస్ట్ చేసింది. ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. ఫెడ్ రేట్లు మారినా ఈ డిపాజిట్ల వడ్డీపై మార్పు ఉండదు.
గడిచిన ఏడాది కాలంలో అమెరికాలో వడ్డీ రేట్లను ఫెడ్ పలు దఫాలుగా వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఆ రేటు 4.71 శాతానికి చేరుకుంది. దాంతో ఎస్‌వీబీ కకావికలమైంది. తన పెట్టుబడులపై వచ్చే వడ్డీ తక్కువ కావడం, తమ వద్ద డిపాజిట్లు చేసిన వారికి అధిక వడ్డీ ఇవ్వడంతో లిక్విడిటీని పెంచుకోవడం ఒక్కటే మార్గంగా భావించింది.

నిజానికి 2020లో ఈ బ్యాంకులో డిపాజిటర్లు చేసిన ఫిక్డ్స్ డిపాజిట్ల మొత్తం 61.70 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2021లో అది కాస్తా 189.20 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. అంటే కరోనా కల్లోలంలో కూడా గట్టిగా నిలదొక్కుకోగలింది. 2022లో టెక్ కంపెనీల్లో సంక్షోభం ఆరంభమవ్వడంతో  విత్‌డ్రాలు పెరిగిపోయాయి.

 దాంతో లిక్విడిటీని పెంచుకునే దిశలో బాండ్లను నష్టానికి విత్‌డ్రా చేసుకుంది. అంటే 21 బిలియన్ డాలర్లకు బదులు ఎస్‌వీబీకి దక్కింది 1.8 బిలియన్ డాలర్ల నష్టమే! ఈ బ్యాంకుకు గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలు– 1.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇంకా 0.3 బిలియన్ డాలర్లు నష్టమే!

ఈ నష్టాన్ని కవర్ చేయడానికి మరో 2.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మడానికి సిద్ధమైంది. అదే ఎస్‌వీబీ కొంప ముంచింది. దీనికి తోడు ఎస్‌వీబీని దాని మాతృసంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ హస్తగతం చేసుకోబోతోందనే వార్తల నేపథ్యంలో డిపాజిటర్లు విత్‌డ్రాలకు ఎగబడ్డారు. ఈ ప్రభావం ఎస్‌వీబీ షేర్లపై తీవ్రంగా పడింది. గురువారం 50%, శుక్రవారం 66% మేర ఆ బ్యాంకు షేర్లు పతనమైపోయాయి.

గత ఏడాది సెప్టెంబరులో 406 డాలర్లుగా ఉన్న ఎస్‌వీబీ షేర్ విలువ శుక్రవారం 106 డాలర్లకు పడిపోయింది. ఓ దశలో ఎస్‌వీబీ షేర్ల ట్రేడింగ్‌ను సెక్యూరిటీస్ సంస్థ నిలిపివేయాల్సి వచ్చింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఏకంగా ఈ బ్యాంకును దివాలా తీసినట్లుగా ప్రకటించింది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత, ఇదే అతి పెద్ద బ్యాంకు వైఫల్యం అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.