ఆత్మగౌరవం కోసమే బిఆర్ఎస్ కు రాజీనామాలు

ఆత్మగౌరవం కోసమే బిఆర్ఎస్ కు రాజీనామాలు
బిఆర్ఎస్ లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేకే రాజీనామాకు సిద్ధపడినట్లు వనపర్తి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి ,వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, సల్కెలాపురం మార్కెట్ డైరెక్టర్ చరణ్ కుమార్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులతో కలసి మీడియాతో మాట్లాడి మరో 20 రోజులలో తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
 
మామూలు కార్మికులు సైతం ఆత్మగౌరవం కోరుకుంటారని అలాంటిది ప్రజలిచ్చిన అధికారంలో ఉండి కూడా ఆత్మ గౌరవాన్ని పొందలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన తాము ప్రజల్లోకి వెళ్లి ఎందుకు అభివృద్ధి చేయలేకపోయామో, ఎందుకు వాగ్దానాలు నెరవేర్చలేకపోయామో వివరిస్తామని చెప్పారు.
 
 ప్రజలు ప్రత్యామ్నాయం ఎలా సూచిస్తే ఎలా కోరుకుంటే అలాగే ముందుకెళ్తామని తెలిపారు. తాను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎవరితోనూ ఏనాడు ఒక్క రూపాయి ఆశించకుండా రాజకీయం చేశానని చెప్పారు. తాను న్యాయపరంగా సంపాదించలేదని నిరూపిస్తే ఉరి వేసుకునేందుకు సిద్ధమని తేల్చి చెప్పారు.
 
 ఇదే తరహాలో ప్రకటించేందుకు ఉరి వేసుకునేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి సిద్ధమా? అని బి ఆర్ ఎస్ కు రాజీనామా చేసిన పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సవాల్ విసిరారు. నిరంజన్ రెడ్డకి నీళ్ల నిరంజన్ రెడ్డి పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమని అంటూఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో ప్రజల మనసుల్లో ఉందని పేర్కొన్నారు.
 
వనపర్తిని వనపర్తి వారే పాలించాలని పక్క ప్రాంత వ్యక్తులకు అవకాశం ఇవ్వద్దని వనపర్తి నియోజకవర్గ మేధావులు విద్యావంతులు ఉద్యోగులు యువత ప్రజలు ఆలోచించాలని వారు పిలుపునిచ్చారు. నియంత పాలన అంతం కోసం ఇకనుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. బెదిరింపులు పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
 
అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు మార్కెట్ డైరెక్టర్లతో పాటు మాజీ జెడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు పలువురు బి ఆర్ ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 300 మంది వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.