2047 నాటికి విశ్వగురువుగా, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్

2047 నాటికి విశ్వగురువుగా, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్

అమృత్ పాలనలో 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ  42 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని ఈ దిశగా పని చేస్తున్నారని  కేంద్ర రసాయనాలు, ఎరువులు, నూతన,  పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి  భగవంత్ ఖుబా తెలిపారు.2047  నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందని అన్న  ధీమాను మంత్రి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)  పదో స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ భారతదేశాన్ని ఒకప్పుడు బంగారు పక్షి అని పిలిచేవారని, ఇప్పుడు అదే పక్షి  విద్య, ఆధ్యాత్మిక, సంస్కృతి తదితర రంగాల్లో గతంలో మాదిరిగానే విశ్వ గురువుగా ప్రపంచాన్ని నడిపించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. 

గత కొన్ని సంవత్సరాలుగా  భారతీయ ఫార్మాస్యూటికల్ రంగం సాధించిన విజయాలు, కరోనా మహమ్మారి సమయంలో భారతీయ ఫార్మాస్యూటికల్ రంగం పోషించిన పాత్ర  వివరించారు. నిజ జీవిత అవసరాలను తీర్చడానికి పరిశోధన ఫలితాలు ఉపయోగపడాలని చెప్పారు.

నైపర్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ శశి బాలా సింగ్ స్వాగతం పలుకుతూ 16 ఏళ్ల స్వల్ప కాలంలోనే ఈ సంస్థ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో అడ్వాన్స్ డ్ స్టడీస్, లెర్నింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఎదిగిందని చెప్పారు.  పరిశోధన, పారిశ్రామిక ప్రాజెక్టులు, విద్యార్థుల ప్రతిభ వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించిన ఎన్ఐఆర్ఎఫ్ 2వ స్థానంలో నిలిచిందని తెలిపారు.

  శ్రీ. లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ సత్యనారాయణ చావా మాట్లాడుతూ ప్రతిష్టాత్మక సంస్థ పెంపొందించిన మూల విలువలు గౌరవిస్తూ  దేశాభివృద్ధిలో చురుగ్గా పాల్గొనాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. గ్రాడ్యుయేట్లు సంస్థ ఖ్యాతిని ఇనుమడింప జేయాలని, భవిష్యత్ ప్రయత్నంలో విజయం సాధించాలని  ఆకాంక్షించారు.