
జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వార్డ్ కౌన్సిలర్ కు రాజీనామా చేశారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె గత నెల 25న తన పదవికి రాజీనామా చేశారు. గురువారం పార్టీకి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే సంజయ్ స్వార్ధపూరిత కుట్రలకు బీసీ మహిళ బలైందని, అందుకే ఆత్మాభిమానం కోసమే మున్సిపల్ పదవికి రాజీనామా చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కవిత అనుచరులను పార్టీకి దూరం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని ఆమె ఆరోపించారు. పార్టీ నుండి తనకు ఎలాంటి సహకారం లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆమె వెల్లడించారు. ప్రజల ఓట్లతో గెలిచానే తప్ప ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే గెలవలేదని స్పష్టం చేశారు. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానని భరోసా ఇచ్చారు.
మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన తనకు ప్రజల నుండి, వివిధ సంఘాల నుండి ఎంతో మద్దతు, భరోసా లభించిందని శ్రావణి పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది ఎన్నారైలు తనకు నైతికంగా మద్దతు ఇచ్చారని చెబుతూ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తాను నమ్మిన పార్టీ నుండి తనకు ఎలాంటి ఓదార్పు గాని, భరోసాగాని లభించలేదనే ఆవేదనతో తాను బాధాతప్త హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఎమ్మెల్యే అనుచరుల నుండి తనకు బెదిరింపు కాల్స్ మెసేజ్ లు వస్తున్నాయని, తన మద్దతుదారులను కూడా బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన కుటుంబాన్ని అవమానపరిచే విధంగా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని పేర్కొంటూ ఇలాంటి చర్యలు మంచివి కావని హితవు పలికారు.
ఎమ్మెల్యే వల్ల వేధింపులకు గురైంది తాను మాత్రమే కాదని తనతో పాటు ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు వేధింపులకు గురవుతూ పార్టీలోనే ఉన్నారని ఆమె చెప్పారు. కనీసం వారికైనా తగిన భరోసా కల్పించాలని పార్టీ అధినాయకత్వానికి భోగ శ్రావణి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
More Stories
రెండు గంటల్లో హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం!
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు