ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మార్చేందుకే యుపి ఇన్వెస్టర్స్ సమ్మిట్‌

రాబోయే 5 సంవత్సరాలలో ఉత్తర ప్రదేశ్ ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి ఈ నెల  10,12 తేదీల మధ్య యూపీ రాజధాని లక్నోలో ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ (యూపీజీఐఎస్ 2023) జరుగనుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఈ సదస్సుకు తమ ప్రభుత్వం రాష్ట్రం, దేశం, ప్రపంచం నుండి పెట్టుబడిదారులను ఆహ్వానించిందని పేర్కొన్నారు.

 భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలనే లక్ష్యాన్ని సాధించాలనుకుంటుందని చెబుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆ లక్ష్యంలో పెద్ద పాత్ర పోషించవలసి ఉంటుందని ఆదిత్యనాథ్ చెప్పారు. ఉత్తర ప్రదేశ్ వృద్ధి రేటు 13 నుండి 14 శాతం మధ్య ఉందని చెబుతూ కరోనా సవాలును యూపీ ఎదుర్కొంటూనే రాష్ట్రంలో జిడిపి, తలసరి ఆదాయం రెట్టింపు అయిందని ఆయన వెల్లడించారు.

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, రాజకీయ, ఆర్థిక ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా వ్యాపార నెట్‌వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, వ్యూహాత్మక భాగస్వామ్యానికి యూపీజీఐఎస్ 2023 ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని
 
కాగా, యూపీజీఐఎస్ 2023కి ముందు పెట్టుబడులను ఆకర్షించేందుకు 2022 డిసెంబర్‌లో 16 దేశాల్లోని 21 నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు  ఆదిత్యనాథ్ ఎనిమిది బృందాలను పంపారు. మీడియా నివేదికల ప్రకారం, ప్రధాన ఈవెంట్‌కు ముందే, యుపి ప్రభుత్వానికి రూ. 20 లక్షల కోట్లకంటే ఎక్కువ పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి.
 
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముందు యూపీ విద్యాశాఖకు రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయని  ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయ చెబుతూ ఉత్తర ప్రదేశ్ లో గడిచిన 6 ఏళ్లలో 5 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు  కల్పించామని తెలిపారు. వచ్చే 2-4 ఏళ్లలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.