ఎల్‌ఐసి పాలసీదారుల సొమ్ము చాలా భద్రం

పాలసీదారుల సొమ్ము చాలా భద్రంగా ఉందని ఎల్‌ఐసి ఉద్యోగ సంఘాలు భరోసా ఇచ్చాయి. అమెరికన్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలిసిందే. వీటిలో ఎల్‌ఐసి పెట్టుబడులుగా పెట్టిన పాలసీదారుల సొమ్ము ప్రమాదంలో పడిందని రాజకీయ పార్టీలు, పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
దీనిపై ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా క్లాస్‌ వన్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫీల్డ్‌ వర్కర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌డబ్ల్యుఐ), ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఇఎ), ఆల్‌ ఇండియా ఎల్‌ఐసి ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఎఐఎల్‌ఇఎఫ్‌) సంఘాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.
 
”హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలి. ఈ సమస్య వల్ల అదానీ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలపై, కష్టపడి సంపాదించుకున్న లక్షలాది మంది భారతీయుల పొదుపుపై ప్రభావం పడింది” అని వారు సూచించారు.
 
అయితే, పార్లమెంట్‌ పరిశీలన, నియంత్రణ పర్యవేక్షణకు లోబడి ఎల్‌ఐసి ఎప్పుడూ పాలసీదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి నిర్ణయాలు చేస్తుందని వారు స్పష్టం చేశారు. పెట్టుబడుల నిర్ణయాలపై బోర్డు క్షుణ్ణంగా నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొంటూ ఎల్‌ఐసి పెట్టుబడుల్లో 80 శాతం కూడా ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా బాండ్ల లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పాలసీదారుల సొమ్ము చాలా సురక్షితంగానే ఉంటుందని వారు స్పష్టం చేశారు.
 
మిగిలిన 20 శాతం వరకు మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులుగా పెడుతుందని చెబుతూ అదానీ కంపెనీల్లో నష్టాలు కేవలం కాల్పనికం అని వారు పేర్కొన్నారు. అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్‌ఐసి రూ.36,474.78 కోట్ల పెట్టుబడులు పెట్టగా, ప్రస్తుతం వీటి విలువ రూ.56,142 కోట్లుగా ఉందని జనవరి 30న ఎల్‌ఐసి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో రూ.20,000 కోట్ల పైన లాభాల్లోనే ఉన్నట్టు తేలుతుంది.
 
ప్రతీ ఏడాది ఎల్‌ఐసి వద్ద రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల మిగులు నిధులు ఉంటాయి. ఇందులో కొంత సొమ్మును బ్లూచిప్‌ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్ పాలసీదారులకు రిటర్న్‌లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అదానీ, టాటా, రిలయన్స్‌, ఎల్‌ఐసి తదితర కంపెనీల స్టాక్స్‌ల్లో పెట్టుబడులు ఉన్నాయని వారు వివరించారు.
 
ఆరు దశాబ్దాల రికార్డ్‌ కలిగిన ఎల్‌ఐసిలో పాలసీదారుల సొమ్ముకు ఎలాంటి డోకా లేదని చెబుతూ వారి డిపాజిట్లపై మంచి రిటర్న్‌లు ఇవ్వడమే సంస్థ లక్ష్యం అని ఎల్‌ఐసి ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. అత్యంత ఉత్తమమైన ప్రభుత్వ రంగ విత్త సంస్థ ఎల్‌ఐసి కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఈ నెల 6న తలపెట్టిన ఆందోళనల పిలుపును ఆ పార్టీ వెనక్కి తీసుకోవాలని ఆయా సంఘాల ప్రతినిధులు ఎస్‌ రాజ్‌ కుమార్‌, వివేక్‌ సింగ్‌, శ్రీకాంత్‌ మిశ్రా, రాజేష్‌ కుమార్‌ కోరారు.