చైనా ఆక్రమణల అంశంపై పార్లమెంట్‌లో చర్చించబోం

చైనా ఆక్రమణల అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం అన్ని పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి, సరిహద్దులో చైనా ఆక్రమణలను లేవనెత్తారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరుపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరుపబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, అఖిలపక్ష సమావేశం తర్వాత పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాతో మాట్లాడుతూ అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో 27 పార్టీల తరుఫున 37 మంది నేతలు పాల్గొన్నట్లు చెప్పారు. బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం కోరినట్లు వెల్లడించారు.

అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్ వాల్, వి.మురళీధరన్ తదితరులు హాజరయ్యారు.  మరోవైపు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తొలి రోజున ఆర్థిక సర్వేను లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెడతారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ సమర్పిస్తారు. ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్‌ తొలిదశ సమావేశాలు జరుగుతాయి. అనంతరం మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 6 వరకు మలి దశ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతాయి. పలు బిల్లులను ప్రభుత్వం ఆమోదించనున్నది.