హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ఐటి సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతోన్నాయి. మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. 50 బృందాలతో దాదాపు 40 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కెమికల్స్ సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ లోని ప్రధాన కార్యాలయంతో పాటు మాదాపూర్, జీడిమేట్ల లోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
 
వసుధ ఫార్మా పేరుతో రాజు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 15 కంపెనీల పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు ఐటీ గుర్తించింది  వసుధ ఫార్మా ఛైర్మన్‌గా రాజు ఉండగా.. అతడి ఇళ్లతో పాటు సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
 
వసుధ ఫార్మా సంస్ధకు ఆరుగురు డైరెక్టర్లు ఉండగా, వారందరి ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు, విజయవాడ, వైజాగ్‌లలో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు జరుపుతున్నారు.
 
కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో ఐటీ సోదాలు నిర్వహించింది. రియల్ ఎస్టేట్, సినిమా ఫైనాన్సియర్స్ ఇళ్లపై దాడులు నిర్వహించింది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌‌కు చేరుకుని సోదాలు చేస్తున్నాయి. బిల్డర్ మాధవరెడ్డి, అతని కార్యాలయంతోపాటు ఇల్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలపై సోదాలు సాగించింది. కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్టలో ఐటీ సోదాలు జరిగాయి.