తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి నిన్నటి కంటే మెరుగు

కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గుండెపోటుకు గురయి, ప్రమాదకర పరిస్థితులలో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య ప‌రిస్థితి కాస్త మెరుగుప‌డిన‌ట్టు భావిస్తున్నామ‌ని క‌ర్ణాట‌క ఆరోగ్య‌శాఖ మంత్రి సుధాక‌ర్ తెలిపారు.
 
నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తార‌క‌ర‌త్న‌ అత్యవసర చికిత్స పొందుతున్న నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాలతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి తారకరత్న చికిత్స తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు.
 
తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరు తీసుకువచ్చేందుకు గ్రీన్ చానల్ కారిడార్ ఏర్పాటు చేశామని చెప్పారు. తారకరత్నకు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్య చికిత్స జరుగుతోందని, తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. నిమ్హాన్స్ నుంచి బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా పిలిపించామని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని పేర్కొన్నారు.
 
తారకరత్న పరిస్థితిపై సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని స్పష్టం చేశారు. మంత్రి సుధాకర్ మీడియాతో మాట్లాడే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆయన పక్కనే ఉన్నారు.  తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని, ఇవాళ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ అంతకు ముందు తెలిపారు. తారకరత్న ఎక్మోపై లేరని, ఆరోగ్యం నిలకడగా ఉందని మీడియాకు వెల్లడించారు. తాము ఐసీయూలోకి వెళ్లి కదిలించే ప్రయత్నం చేశామని, స్పందిస్తున్నారని చెప్పారు.
 
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, వారి కుటుంభం సభ్యులు కూడా బెంగుళూరుకు శనివారమే చేరుకున్నారు. నందమూరి, నారా కుటుంభం సభ్యులు చాలా వరకు అక్కడే ఉన్నారు.